టాలీవుడ్ (Tollywood) హీరోల్లో జూనియర్ అని పేరు వచ్చే హీరో ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఎన్టీఆర్. ఈ స్టార్ హీరోను అందరూ జూనియర్ ఎన్టీఆర్ అని పిలుచుకుంటారని తెలిసిందే. ఇపుడు మరో హీరో పేరు ముందు కూడా జూనియర్ పేరు చేరనుంది. ఇంతకీ ఆ యువ హీరో ఎవరనుకుంటున్నారా..? నితిన్ (Nithiin). రైటర్‌గా కిక్, రేసు గుర్రం చిత్రాలకు పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వక్కంతం వంశీ (Vakkantham Vamsi). వక్కంతం వంశీ డైరెక్షన్లో ఈ కుర్ర హీరో కొత్త సినిమాకు సంతకం చేసినట్టు టాలీవుడ్ సర్కిల్ సమాచారం.
నా పేరు సూర్య సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన వంశీ మళ్లీ చాలా కాలం తర్వాత ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టుకు ‘జూనియర్’ (Junior)అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో కిక్, పోకిరి లను మించి హై డోస్ ఎంటర్టైన్ మెంట్ ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేశాడట వక్కంతం వంశీ. వక్కంతం వంశి ఈ సారి డైరెక్టర్ గా తనను ప్రూవ్ చేసుకుంటాడా..? లేదా అనేది చూడాలి.
గతేడాది నితిన్ నటించిన చెక్, రంగ్ దే, మ్యాస్ట్రో సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు నితిన్. వీటిలో రంగ్ దే మంచి టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం మాచెర్ల నియోజకవర్గం సినిమాలో నటిస్తున్నాడు నితిన్. ఈ సినిమాకు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.