Animated Movie | హరిహర వీరమల్లు, కింగ్డమ్ వంటి పెద్ద సినిమాలు రీసెంట్గా విడుదల కాగా, ఈ సినిమాల కన్నా కూడా మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన తొలి చిత్రం ‘మహావతార్ నరసింహ’ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌గా నిలిచింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పౌరాణిక యానిమేటెడ్ ప్రాజెక్ట్‌ను రూపొందించింది. పూర్తి స్థాయిలో యానిమేషన్‌తో రూపొందిన ఈ సినిమా థియేటర్లలోకి ఎలాంటి హైప్ లేకుండానే సైలెంట్‌గా అడుగుపెట్టినా, మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
ఇది ప్రమోషన్లు, స్పెషల్ ఈవెంట్లు లేకుండానే నేరుగా థియేటర్లలో విడుదలైంది. కానీ ప్రేక్షకులు చూపించిన స్పందన అసాధారణంగా ఉండటంతో, సినిమాపై ఉన్న అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు రావడంతో, వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా మూవీ క్రేజ్ పెరిగిపోతుంది. ఇతర భాషల్లో ముఖ్యంగా హిందీ వెర్షన్‌కు నార్త్ ఇండియాలో విపరీతమైన స్పందన లభిస్తోంది. భారీ సంఖ్యలో స్క్రీన్లు కేటాయించడంతో పాటు, నాన్-హాలీడే రోజుల్లో కూడా మంచి ఆక్యుపెన్సీ నమోదు అవుతోంది. తెలుగులోనూ అదే స్థాయిలో అనూహ్యంగా ప్రీ బుకింగ్స్ జరుగుతున్నాయి.
సినిమా విడుదలైన వారం రోజుల్లోనే రూ. 53 కోట్ల గ్రాస్ వసూలు చేయడం గమనార్హం. ఈ ప్రదర్శనతో పెద్ద సినిమాలకు కూడా ఇది ఒక విధంగా ఛాలెంజ్ విసురుతోందన్న మాట. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఈ సినిమా * లాంగ్ రన్లో రూ.100 కోట్ల మార్క్‌ను తాకే అవకాశముంది. ‘మహావతార్ నరసింహ’ ఈ సినిమాటిక్ యూనివర్స్‌లో తొలి చిత్రం కాగా, హోంబలే ఫిల్మ్స్ ఇప్పటికే మొత్తం ఏడుపాటు చిత్రాలు ఉంటాయని ప్రకటించింది. మొదటి సినిమా విజయం, మిగతా ప్రాజెక్టులకు బలమైన పునాదిని వేసినట్లయ్యింది. దర్శకుడు అశ్విన్ కుమార్ విజన్‌కు మంచి టెక్నికల్ బలం తోడు కావడంతో సినిమా మంచి విజయం సాధించింది.. హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించాయి. అంచనాలు లేకుండానే విడుదలై భారీ విజయాన్ని సాధించిన ‘మహావతార్ నరసింహ’, భారతీయ యానిమేటెడ్ సినిమాల ట్రెండ్‌ను మార్చే దిశగా సాగుతోంది.