Anchor Rashmi | బుల్లితెరపై ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న కామెడీ షో ‘జబర్దస్త్’. ఒకప్పుడు స్టార్ కమెడియన్లతో కళకళలాడిన ఈ షో.. ప్రస్తుతం మళ్లీ తన పూర్వ వైభవాన్ని సొంతం చేసుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా గతంలో జబర్దస్త్‌కు వెన్నెముకగా నిలిచిన పలువురు కమెడియన్లను తిరిగి షోలోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్‌లోకి జడ్జిగా రీ ఎంట్రీ ఇచ్చారు. ఆయన రాకతో షోకు మళ్లీ పాత కళ వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కమెడియన్ల మధ్య పోటీ పెంచేందుకు నాగబాబు కూడా ప్రత్యేక ఆఫర్లు, ఛాలెంజ్‌లు ప్రకటిస్తూ షోపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో జబర్దస్త్‌లో తమ కామెడీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పలువురు కమెడియన్లు తిరిగి ఎంట్రీ ఇస్తున్నారు.
ఇప్పటికే హైపర్ ఆది, ధనాధన్ ధన్‌రాజ్, చలాకీ చంటి, సద్దాం, వినోద్ అలియాస్ వినోదిని తదితరులు జబర్దస్త్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. తమదైన పంచ్‌లు, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో ఇద్దరు క్రేజీ కమెడియన్లు చేరారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను కూడా చాలా రోజుల తర్వాత జబర్దస్త్ వేదికపై కనిపించారు. ఈ ఇద్దరూ కలిసి కనిపించడంతో షో అభిమానుల్లో ఒక్కసారిగా పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ‘కామెడీ కింగ్స్ ఈజ్ బ్యాక్’ అంటూ మేకర్స్ విడుదల చేసిన తాజా ప్రోమో సోషల్ మీడియాలో ఆసక్తిని పెంచుతోంది. ఎప్పటిలాగే సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను తమదైన కామెడీ పంచ్‌లు, ప్రాసలతో ప్రేక్షకులను నవ్వించారు. యాంకర్ రష్మీతో కలిసి వీరిద్దరూ చేసిన కామెడీ కూడా ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది.
అయితే ఈ ఎపిసోడ్లో నవ్వులతో పాటు ఎమోషనల్ మూమెంట్ కూడా చోటుచేసుకుంది. చాలా రోజుల తర్వాత సుడిగాలి సుధీర్‌ను జబర్దస్త్ వేదికపై చూసిన రష్మీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. తాము ఇద్దరూ ఒకేసారి జబర్దస్త్ ప్రయాణాన్ని ప్రారంభించామని రష్మీ గుర్తుచేసుకుంది. సుధీర్ షో నుంచి వెళ్లిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె ఎమోషనల్ అయింది. దీంతో ఈ ప్రోమోలో రష్మీ, సుధీర్ మధ్య ఉన్న అనుబంధం మరోసారి హైలైట్ అయింది.అయితే సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను ఈసారి కేవలం గెస్ట్లుగా మాత్రమే జబర్దస్త్‌కు వచ్చారా? లేక ఇకపై షోలో కంటిన్యూ అవుతారా? అనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరూ ఈ ఎపిసోడ్‌కు మాత్రమే గెస్టులుగా వచ్చినట్లు తెలుస్తోంది.