Anaswara Rajan | మలయాళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి అనస్వర రాజన్ తాజాగా ‘ఛాంపియన్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన పేరు ‘అనస్వర’కు “నాశనం లేనిది” లేదా “అనంతమైనది” అనే అర్థం ఉందని తెలిపింది. అలానే తెలుగు ప్రేక్షకులపై ప్రశంసలు కురిపించింది. “తెలుగు ప్రేక్షకులు మంచి సినిమా, మంచి నటనను ఎప్పుడూ ఆదరిస్తారు. ఆ స్వీకరణ ఎంతో ప్రత్యేకం” అని చెప్పింది. 2019లో విడుదలైన మలయాళ చిత్రం ‘తన్నీర్ మతన్ దినంగల్’ ద్వారానే తెలుగు ప్రేక్షకుల ప్రేమను పొందానని, అప్పటి నుంచే తెలుగు సినిమాల్లో నటించాలని ఆశపడ్డానని పేర్కొంది.
‘ఛాంపియన్’ చిత్రం సాధారణ ప్రేమకథలకు భిన్నంగా ఉంటుందని, ఇందులో తాను పోషించిన చంద్రకళ పాత్ర తనకు కొత్త సవాలుగా నిలిచిందని అనస్వర వెల్లడించింది. ఎనిమిదో తరగతిలోనే తన తొలి సినిమా ఆడిషన్‌కు హాజరై, ఎలాంటి నటనా అనుభవం లేకుండానే ఎంపిక కావడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని గుర్తు చేసుకుంది. కేరళలోని ఓ చిన్న గ్రామం నుంచి సినీ నేపథ్యం లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చినట్లు తెలిపిన అనస్వర, ఆడిషన్లకు వెళ్లడంలో తన అక్క సహకరించిందని, తల్లిదండ్రుల మద్దతే తన బలమని చెప్పింది. సినిమా రంగం తనను నటిగా మాత్రమే కాకుండా వ్యక్తిగా కూడా ఎదగనిచ్చిందని ఆమె పేర్కొంది.
నటన ద్వారా లభించే అడ్రినలిన్ రష్ డబ్బు, కీర్తికంటే ఎక్కువ సంతృప్తినిస్తుందని చెప్పిన అనస్వర, ప్రశంసలతో పాటు విమర్శలను కూడా స్వీకరించే స్థాయికి తాను చేరుకున్నానని తెలిపింది. అలాగే అల్లు అర్జున్ తనకు ఇష్టమైన తెలుగు హీరో అని, తెలియకుండానే తెలుగు సినిమాలపై అభిమానం పెరిగిందని చెప్పడం విశేషం. ‘ఛాంపియన్’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనస్వర రాజన్, తన ప్రయాణం ఇక్కడితో ఆగదని, మంచి పాత్రలతో మరింత ముందుకు వెళ్లాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.