Amazon Prime Video Subscription | ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియాపై వినియోగదారుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఏడాదికి రూ.1,499 చెల్లించి ప్రైమ్ వీడియో (Prime Video) సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక కూడా, కొత్త సినిమాలు చూడటం కోసం, అదనపు ఛానెల్స్ యాక్సెస్ చేయడం కోసం మళ్లీ డబ్బులు వసూలు చేయడాన్ని వినియోగదారులు తీవ్ర మోసంగా అభివర్ణిస్తున్నారు.
ప్రైమ్ వీడియో వార్షిక సభ్యత్వం రూ.1,499 చెల్లించిన తర్వాత కూడా కొన్ని సినిమాలు, సిరీస్‌లు చూడాలంటే అదనంగా చెల్లించాలని ప్రైమ్ షరతు విధించింది. అలాగే యూరోస్ నౌ (Eros Now), డిస్కవరీ+ (Discovery+), లయన్స్‌గేట్ ప్లే (Lionsgate Play) వంటి ఛానెల్స్ చూడాలంటే సబ్‌స్క్రిప్షన్‌తో పాటు మరిన్ని డబ్బులు చెల్లించాలనే నిబంధన పెట్టింది.
ఇవే కాకుండా, ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో కొత్తగా వస్తున్న ప్రకటనలను రద్దు చేసుకోవాలనుకుంటే, అదనంగా సంవత్సరానికి రూ.699 చెల్లించాల్సి వస్తోంది. దీంతో దాదాపు ప్రైమ్ వీడియో ద్వారానే ఒక వినియోగదారుడికి సుమారు రూ.4,000 పైగా ఖర్చు వస్తుందని, ఇది సబ్స్క్రిప్షన్ పేరుతో జరుగుతున్న ‘నెక్స్ట్ లెవెల్ స్కామ్’ అని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ (Ministry of Information and Broadcasting – MIB) ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.