Allu Arjun | ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌తో సినీ రంగంలో అడుగుపెట్టినా, తన కష్టంతోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అల్లు అర్జున్. స్టైలిష్ స్టార్‌గా మొదలైన ఆయన ప్రయాణం, నేడు ఐకాన్ స్టార్ స్థాయికి చేరుకుంది. ఏప్రిల్ 8న ఆయన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు మరోసారి చర్చకు వచ్చాయి. దిగ్గజ హాస్యనటుడు అల్లు రామలింగయ్య మనవడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా, మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి చెందిన వ్యక్తిగా అల్లు అర్జున్ సినీ రంగంలోకి ప్రవేశించారు. 2003లో విడుదలైన ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. K. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.
అయితే హీరోగా పరిచయం కాకముందే అల్లు అర్జున్ మూడు సినిమాల్లో నటించారు. 1985లో ‘విజేత’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 1986లో కే. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘స్వాతి ముత్యం’ చిత్రంలో కమల్ హాసన్ మనవడి పాత్రలో కనిపించారు. అలాగే 2001లో సురేష్ దర్శకత్వంలో వచ్చిన ‘డాడీ’ చిత్రంలో చిన్న పాత్ర పోషించారు. హీరోగా గంగోత్రి చిత్రంతో పలకరించాడు. ‘గంగోత్రి’ సినిమా విజయం సాధించినప్పటికీ, ఆ సమయంలో అల్లు అర్జున్ లుక్స్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. హీరోగా సరిపోడని, కుటుంబం సహాయంతో అవకాశాలు వస్తున్నాయని అనేక కామెంట్లు వచ్చాయి. కానీ రెండో సినిమా ‘ఆర్య’తోనే ఆ విమర్శలకు గట్టి సమాధానం ఇచ్చారు. తన నటన, స్టైల్, డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోగా ఎదిగారు.
ఆ తర్వాత ప్రతి సినిమాలో కొత్తగా కనిపిస్తూ, తనను తాను మెరుగుపరుచుకుంటూ వచ్చిన బన్నీ, కృషి, పట్టుదలతో ఎదిగారు. ఈ క్రమంలో ఆయనకు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం కూడా లభించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ అల్లు అర్జున్‌కు భారీ అభిమాన వర్గం ఉంది. ముఖ్యంగా ‘పుష్ప’ సినిమా తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరిగింది. ‘పుష్ప 2’ చిత్రం భారీ విజయాన్ని సాధించి ఆయనను ఐకాన్ స్టార్‌గా నిలబెట్టింది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాకా’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాతో అంతర్జాతీయ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.