Alia Bhatt | ఇటీవలి కాలంలో సోషల్‌మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్ గురించి ఆగ్రహం వ్యక్తం చేసింది బాలీవుడ్ భామ అలియాభట్. అందం కోసం తాను ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నదని, తను నవ్వే తీరు అస్సలు బాగోదని వీడియోల ద్వారా కొందరు చేస్తున్న దుష్ప్రచారంపై అలియా మండిపడింది. ‘కొందరైతే నేను అనారోగ్యం బారిన పడ్డానని దారుణమైన ప్రచారానికి దిగారు’ అని అలియా వాపోయింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టానుసారం ప్రచారం చేసేవారు జాగ్రత్తగా ఉండాలని ఆమె హెచ్చరించింది.
ఇంకా మాట్లాడుతూ ‘ఎలాంటి సాక్ష్యాలు లేకుండా పోస్ట్‌లు పెట్టడం చట్టప్రకారం నేరం. కేవలం వ్యూస్ కోసం ఇలాంటి చవకబారు పనులు చేస్తున్నారు. ఆ పోస్ట్‌లకు జుగుప్సాకరమైన కామెంట్స్ పెట్టేవాళ్లలో మహిళలు కూడా ఉండటం సిగ్గుచేటు. ఈ ధోరణి ఎప్పటికైనా ప్రమాదమే. ఈ విషయంలో ఇకపై సీరియస్‌గానే చర్యలు తీసుకోబోతున్నా.’ అని హెచ్చరించింది. ఇటీవలే ‘జిగ్రా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది అలియా. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాతో పాటు అలియా వ్యక్తిగత జీవితంపై కొందరు సోషల్‌మీడియాలో నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు.