Akkineni Sumanth About Sitaramam Movie | అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలలో సుమంత్ ఒకడు. ఇప్పుడంటే ఈయన క్రేజ్ తగ్గింది కాని అప్పట్లో ఈయనకు విపరీతమైన క్రేజ్ ఉండేది. సత్యం, గౌరి, ధన51, గోదావరి వంటి సినిమాలతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు. చాలా కాలం తర్వాత మళ్ళీరావా చిత్రంతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. కమర్షియల్‌గా ఈ చిత్రం ఘన విజయం సాధించకపోయినా, సుమంత్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇదిలా ఉంటే సుమంత్ సీతారామం సినిమాలో కీలకపాత్ర పోషించాడు. ఇటీవలే విడుదలైన ఈయన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రం ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్లను జోరుగా జరుపుతున్నారు. ప్రమోషన్లో భాగంగా సుమంత్ ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలను తెలియజేశాడు.
సుమంత్ ఈ చిత్రంలో తన రోల్ గురించి మాట్లాడుతూ ‘నా కెరీర్లో తొలిసారి చాలా కీలకమైన సపోర్టింగ్ రోల్ ఈ చిత్రంలో చేశాను. ట్రైలర్లో కొంచెమే చూశారు. కావాలనే కొంచెం చూపించాం. నేను సినిమాలో ఏం చేస్తానో అనేది మిస్టరీగా వుంటుంది. ఆగస్ట్ 5న బంగారం లాంటి సినిమా మీ ముందుకు వస్తుంది. ఖచ్చితంగా ఈ సినిమా మీ అందరికి నచ్చుతుంది’. అని చెప్పాడు. అంతేకాకుండా ‘అప్పట్లో ‘గోదావరి’ అనే సీతారాముల కథ చేశాను అది క్లాసిక్ అయ్యింది. ఇప్పడు సీతారామం చేశాను ఇది కూడా క్లాసిక్ అవుతుంది.’ అంటూ చెప్పుకొచ్చాడు.
హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటించాడు. మృనాళ్ థాకూర్ హీరోయిన్గా నటించింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా కథను మలుపు తిప్పే పాత్రలో నటించింది. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్న దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆగస్టు 5న విడుదల కానుంది.