‘ఒక మామూలు కానిస్టేబుల్ చేతిలో నిజం అనే ఆయుధం ఉంటే అతను ఎంత దూరం వెళ్తాడన్నదే ఈ సినిమాలో ప్రధానాంశం. ఈ కథలో ఎన్నో మలుపులుంటాయి’ అన్నారు అక్కినేని నాగచైతన్య. ఆయన కథానాయకుడిగా తెలుగు, తమిళంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’. వెంకట్ ప్రభు దర్శకుడు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నాగచైతన్య మాట్లాడుతూ ‘నాకు ఎప్పటి నుంచో తమిళ సినిమా చేయాలనుంది. ఈ సినిమాతో ఆ కల నెరవేరింది. అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో ఊహకందని మలుపులతో ఈ సినిమా ఉత్కంఠను పంచుతుంది. ఇళయరాజా, యువన్‌శంకర్ రాజా మ్యూజిక్ ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అన్నారు. ‘నా కెరీర్లోనే భారీ చిత్రమిది. ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్. ప్రతి కథలో హీరో విలన్‌ను చంపాలనుకుంటాడు. కానీ ఇందులో విలన్‌ను హీరో కాపాడుతాడు.
ఈ సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. తెలుగు, తమిళ వెర్షన్‌ను ఒకేసారి చిత్రీకరించాం’ అని దర్శకుడు వెంకట్‌ప్రభు తెలిపారు. ఇంటెలిజెంట్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే చిత్రమిదని కథానాయిక కృతిశెట్టి పేర్కొంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.