అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సాక్షి వైద్య నాయిక. మలయాళ నటుడు మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. యాక్షన్ స్పై థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా హీరో అఖిల్ మాట్లాడుతూ…‘అభిమానుల సమక్షంలో మా సినిమా టీజర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. మీరు కొట్టే చప్పట్లే మాకు ఉత్సాహాన్ని ఇస్తుంటాయి. ఆ శక్తిని మీ నుంచి తీసుకునేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఏజెంట్‌తో మీరు కోరుకునే సక్సెస్ కొడుతున్నాం’ అన్నారు. నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ…‘టీజర్ మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నాం. ఈ టీజర్ కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇది చిన్న గన్ నుంచి వచ్చిన బుల్లెట్.
సినిమా మిషన్ గన్ అనుకోవచ్చు. అఖిల్ నటన చాలా బాగుంటుంది. సురేందర్ రెడ్డి ైస్టెలిష్ యాక్షన్ ఈ చిత్రంలో ఆకట్టుకుంటుంది’ అన్నారు. ‘మేము ఈ చిత్రానికి చేయాల్సిన పని ఇంకా ఉంది, అందుకే అప్పుడే దీని గురించి మాట్లాడటం లేదు. సినిమా బ్లాక్ బస్టర్ గ్యారెంటీ’ అని అన్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో నాయిక సాక్షి వైద్య, సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ పాల్గొన్నారు. ఈ టీజర్‌ను తమిళంలో శివకార్తికేయన్, కన్నడలో కిచ్చా సుదీప్, మలయాళంలో మమ్ముట్టి విడుదల చేశారు. హిందీలోనూ టీజర్ విడుదలైంది.