భారతీయ పౌరాణిక ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’. ప్రభాస్ రాముడి పాత్రలో టైటిల్ రోల్‌ని పోషిస్తుండగా, కృతిసనన్ సీత పాత్రలో కనిపించనుంది. ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలోని ‘రామ్ సీతా రామ్’ అనే పూర్తి పాటను సోమవారం విడుదల చేశారు. సచేత్-పరంపర స్వరాల్ని అందించిన ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రచించారు. ఇందులో సీతారాముల మధ్య ఉన్న గాఢమైన అనుబంధాన్ని ఆవిష్కరించారు. సీతా రాముల గుణగణాలను వర్ణిస్తూ ఈ పాట ఆద్యంతం శ్రావ్యంగా సాగింది. ‘ఈ గీతం సీతారాముల అనుబంధానికి దర్పణంలా నిలుస్తుంది. నిజమైన ప్రేమ తాలూకు భావోద్వేగాల్ని ఆవిష్కరిస్తుంది’ అని చిత్రబృందం పేర్కొంది. సైఫ్అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్సేన్, సోనాల్‌చౌహాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ పల్నాని, సంగీతం: సచేత్-పరంపర, నిర్మాత: టీ సిరీస్ భుషణ్ కుమార్, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్, యూవీ క్రియేషన్స్.