Actress Rashmika Mandanna | దక్షిణాదితో పాటు ఉత్తరాదిన కూడా జోరు చూపిస్తుంది రష్మిక మందన్నా. ఐదేళ్ల క్రితం వచ్చిన ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ రెండో సినిమా ‘గీతా గోవిందం’తో తిరుగులేని పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక రెండేళ్ల క్రితం వచ్చిన పుష్పతో జాతీయ స్థాయిలో క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడింది. ఈ సినిమాతో ఏకంగా మూడు బాలీవుడ్ ప్రాజెక్ట్‌లలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మూడు, నాలుగు సినిమాలున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా రష్మిక ఓ కార్యక్రమానికి హాజరై తనకు డిసెంబర్ నెలంటే ఎంతో ఇష్టమని చెప్పింది.
డిసెంబర్ నెలంటే తనకెంతో సెంటిమెంట్ అని, ఆ నెలను తను అదృష్టంగా భావిస్తానని ఈ కన్నడ సొగసరి చెప్పింది. తను నటించిన తొలి సినిమా కిరిక్ పార్టీ డిసెంబర్ నెలలో రిలీజైందని, అంతేకాకుండా తను నటించిన నాలుగు సినిమాలు అదే నెలలో రిలీజై బంపర్ హిట్లయ్యాయిన తెలిపింది. ఇక జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టిన పుష్ప సినిమా సైతం డిసెంబర్ నెలలోనే విడుదలైందని, ఇప్పుడు తను చేస్తున్న యానిమల్ డిసెంబర్లోనే రిలీజ్ కానుందని చెప్పుకొచ్చింది. అందుకే తనకు డిసెంబర్ అంటే చాలా సెంటిమెంట్ అంటూ ఈ స్టార్ హీరోయిన్ వెల్లడించింది.
ప్రస్తుతం ఈ అమ్మడు రేయిన్బో అనే ద్విభాషా సినిమా చేస్తుంది. శాంత రూబన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటుడు శాకుంతలం ఫేమ్ దేవ్ మోహన్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. దీనితో పాటుగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న యానిమల్ సినిమాలో రణ్‌బీర్‌కు జోడీగా నటిస్తుంది. ఇప్పటికే తనకు సంబంధించిన టాకీ పార్టును పూర్తి చేసుకుంది. ఇవే కాకుండా మోస్ట్ అవేయిటెడ్ మూవీ పుష్ప సీక్వెల్లో నటిస్తుంది. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఇన్సైడ్ టాక్.