TN CM Vijay | తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ మేనియా ఇప్పుడు సరిహద్దులు దాటి కాశ్మీర్ పర్యాటక రంగాన్ని ఊపేస్తోంది. ఆయన హీరోగా నటించిన ఇండస్ట్రీ హిట్ ‘లియో’ సినిమా షూటింగ్ జరిగిన దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉన్న ‘సిఫార్ కెఫే’ (Sifar Cafe) ఇప్పుడు తమిళ పర్యాటకులకు అత్యంత ఇష్టమైన సందర్శనీయ స్థలంగా మారిపోయింది.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో విజయ్ పోషించిన పార్థిబన్ పాత్ర ఒక కాఫీ షాప్ నడుపుతూ కనిపిస్తుంది. ఆ సినిమా సెట్టింగ్ మరియు విజయ్ గెటప్‌ను స్ఫూర్తిగా తీసుకుని స్థానికులు దీనిని ‘లియో కెఫే’గా మార్చగా, విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ రద్దీ ఒక్కసారిగా రెట్టింపు అయింది. గతంలో మిలిటెంట్స్ ప్రభావంతో అశాంతిగా ఉండే ఈ ప్రాంతం, ఇప్పుడు విజయ్ అభిమానుల సందడితో కళకళలాడుతోంది. పహల్గామ్ నుండి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చిన్న కెఫే గోడలన్నీ ఇప్పుడు సీఎం విజయ్ పోస్టర్లతో నిండిపోయాయి. ముఖ్యంగా షూటింగ్ సమయంలో విజయ్ ఎక్కడ కూర్చున్నారు, ఆయన ఏం తిన్నారు అనే విషయాలు తెలుసుకోవడానికి తమిళ తంబీలు ఆసక్తి చూపిస్తున్నారు. విజయ్ అక్కడ ‘ట్రౌట్’ అనే చేప వంటకాన్ని మాత్రమే ఆర్డర్ చేశారని కెఫే సిబ్బంది పర్యాటకులకు ఉత్సాహంగా వివరిస్తున్నారు. కేవలం అభిమానులే కాకుండా రాజకీయ కార్యకర్తలు కూడా కాశ్మీర్ పర్యటనలో భాగంగా ఈ కెఫేను సందర్శించి ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ అనూహ్య రద్దీ వల్ల స్థానిక వ్యాపారాలు జోరుగా సాగడమే కాకుండా, ఒక కోలీవుడ్ సినిమా కారణంగా అనంత్‌నాగ్ ప్రాంతం పర్యాటక మ్యాప్‌లో హాట్ స్పాట్‌గా మారడం విశేషం.