Actor Vishal discharged from hospital | ప్రముఖ తమిళ నటుడు విశాల్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం రాత్రి అతడిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు.
విశాల్ గత ఆదివారం విల్లుపురంలో ట్రాన్స్జెండర్ల కోసం నిర్వహించిన ‘మిస్ కువాగం 2025’ అందాల పోటీకి ముఖ్య అతిథిగా హాజరయ్యిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత వేదికపై ఉన్న ఆయన ఒక్కసారిగా స్పృహ తప్పి కుప్పకూలారు. వెంటనే అక్కడున్న అభిమానులు మరియు నిర్వాహకులు ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం, మాజీ మంత్రి కె. పొన్ముడి ఆయనను మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోలుకోవడంతో వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను డిశ్చార్జ్ చేశారు.
ఈ ఘటనపై విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో, విశాల్ అలసట మరియు ఆహారం తీసుకోకపోవడం వల్లే మూర్చపోయారని స్పష్టం చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన భోజనం చేయలేదని, కేవలం జ్యూస్ మాత్రమే తీసుకున్నారని తెలిపారు. వైద్యులు ఆయన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారని, భవిష్యత్తులో సమయానికి భోజనం చేయాలని సూచించారని పేర్కొన్నారు. ప్రస్తుతం విశాల్ బాగానే కోలుకుంటున్నారని, విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన బృందం తెలిపింది.
ఇదిలా ఉండగా, విశాల్ గతంలో కూడా అనారోగ్య సమస్యలతో బాధపడ్డారు. ఈ ఏడాది జనవరిలో ‘మద గజ రాజా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే అది జ్వరం వల్ల వచ్చిందని ఆయన అభిమానులకు తెలిపారు.