Actor Nikhil | టాలీవుడ్ నటుడు నిఖిల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. శేఖర్ కమ్ముల హ్యాపిడేస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తొలిచిత్రంతోనే నటుడిగా మంచి మార్కులు సంపాదించాడు. ఆ తర్వాత, స్వామి రారా, కార్తికేయ, కార్తికేయ 2 వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. అయితే తాజాగా ఈ నటుడి చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని చీరాలలో కొన్ని సంవత్సరాలుగా ఓ ఆలయం మూసి ఉంది. అయితే ఈ ఆలయాన్ని తిరిగి తెరిపించాడు నిఖిల్. ఆలయాన్ని ఓపెన్ చేయడమే కాకుండా దాని నిర్వహణ బాధ్యతలు తీసుకున్నాడు. ఈ విషయాన్ని నిఖిల్ ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. ఇక కొన్ని ఏండ్లుగా మూసేసిన ఆలయాన్ని నిఖిల్ తెరిపించడంతో నిఖిల్‌పై గ్రామస్థులు ఆదరాభిమానాలు కురిపించారు. ఆలయాన్ని తిరిగి తెరిపించేందుకు వచ్చిన నిఖిల్‌ను పూలపై నడిపించి ఆహ్వానించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇటీవల కార్తికేయ-2తో తిరుగులేని విజయాన్ని అందుకున్న నిఖిల్ ప్రస్తుతం స్వయంభు సినిమాలో నటిస్తున్నాడు. నిఖిల్ ఇందులో వారియర్‌గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో నభ నటేష్‌తో పాటు సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు.