Mukul Dev – Manoj Bajpayee | ప్రముఖ నటుడు, మోడల్ ముకుల్ దేవ్ (54) కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మే 23న (శుక్రవారం) తుది శ్వాస విడిచినట్లు సమాచారం. ఆయన మరణవార్తతో బాలీవుడ్ పరిశ్రమలో తీవ్ర విషాదం అలుముకుంది. ముకుల్ దేవ్ మరణం పట్ల సహ నటులు, స్నేహితులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నటుడు మనోజ్ బాజ్‌పాయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియాలో భావోద్వేగపూరిత పోస్ట్ చేశారు.
“నేను ఎంత బాధలో ఉన్నానో మాటల్లో చెప్పలేను. ముకుల్ నాకు సొంత తమ్ముడితో సమానం. అతని ప్రేమ, అభిరుచికి సాటి రావు. ఇంత త్వరగా, ఇంత చిన్న వయసులోనే వెళ్లిపోవడం చాలా బాధగా ఉంది. అతని కుటుంబానికి, ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్న ప్రతి ఒక్కరికీ బలం, ధైర్యం కలగాలని కోరుకుంటున్నాను. మిస్ యూ మేరీ జాన్… మనం మళ్ళీ కలిసే వరకు, ఓం శాంతి” అని మనోజ్ బాజ్‌పాయ్ తన సంతాపాన్ని తెలియజేశారు.
1996లో విడుదలైన ‘దస్తక్’ చిత్రంతో ముకుల్ దేవ్ బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేశారు. సుష్మితా సేన్‌తో కలిసి ఈ సినిమాలో నటించారు. ఆ తర్వాత హిందీతో పాటు పంజాబీ, బెంగాలీ, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లోనూ 60కి పైగా సినిమాల్లో నటించారు. టెలివిజన్ సీరియల్స్‌లో కూడా నటించి మెప్పించారు. ‘సన్ ఆఫ్ సర్దార్’, ‘ఆర్… రాజ్‌కుమార్’, జై హో, రవితేజ కృష్ణ, ప్రభాస్ ఏక్ నిరంజన్ చిత్రాలలో ఆయన నటనకు మంచి గుర్తింపు లభించింది. 2022లో విడుదలైన ‘ఆంత్ ది ఎండ్’ అనే సినిమాలో చివరిసారిగా కనిపించారు. నటనతో పాటు, ముకుల్ దేవ్ శిక్షణ పొందిన పైలట్, ఏవియేషన్ ట్రైనర్ కూడా కావడం విశేషం.
It’s impossible to put into words what I’m feeling. Mukul was a brother in spirit, an artist whose warmth and passion were unmatched. Gone too soon, too young. Praying for strength and healing for his family and everyone grieving this loss. Miss you meri jaan…until we meet… pic.twitter.com/grfN3XKz7b
— manoj bajpayee (@BajpayeeManoj) May 24, 2025