న్యూయార్క్: అమెరికాకు చెందిన ప్రముఖ హాలీవుడ్ నటుడు అల్ పాసినో (అల్ఫ్రెడో జేమ్స్ పాసినో) 83 ఏళ్ల వయస్సులో తండ్రి కాబోతున్నారని, ఆయన హలీవుడ్ నటి, 29 ఏళ్ల నూర్ అల్ఫల్లా తో గత కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్నారని ఇటీవల అల్ పాసినో సన్నిహితులు వెల్లడించారు. అల్ పాసినోతో డేటింగ్లో ఉన్న క్రమంలో నూర్ అల్ఫల్లా గర్భం దాల్చిందని, నూర్ ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భవతి అని, మరో నెల రోజుల్లో అల్ పాసినో నాలుగో బిడ్డకు తండ్రి కాబోతున్నారని వారు ప్రకటించారు.
అయితే నూర్ గర్భవతి అని తెలిసిన వెంటనే నూర్‌కు, అల్ పాసినోకు మధ్య చాలా తతంగమే నడిచిందట. అల్ పాసినో తనకు పిల్లలు పుట్టే సామర్థ్యం ఉందా..? అని అనుమానం వ్యక్తం చేశాడట. తాను గతంలో చేయించుకున్న వైద్య పరీక్షల్లో వచ్చిన ఫలితాలను బట్టి పిల్లలు పుట్టే సామర్థ్యం లేదని పేర్కొన్నాడట. నూర్ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి తానో.. కాదో..? తేలడానికి DNA పరీక్ష చేయించుకోవాలని ఆయన డిమాండ్ చేశాడట.
దాంతో నూర్ DNA పరీక్షలు చేయించుకోగా ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి అల్ పాసినోనే అని తేలింది. కాగా నూర్, అల్ పాసినోలు కరోనా మొదటి వేవ్ సమయం నుంచి డేటింగ్లో ఉన్నారు. అయితే ఆ విషయం గత ఏడాది ఏప్రిల్‌లో వారు సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ ఫొటో ద్వారా బయటి ప్రపంచానికి తెలిసింది. ప్రస్తుతం అల్ పాసినో నాలుగో బిడ్డకు తండ్రి కాబోతుండగా.. నూర్ అల్ఫల్లా మాత్రం తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నది.