ప్రసిద్ధ దేవాలయాల్లో నిక్షిప్తమై ఉండే నేలమాళిగలు, వాటితో దాగుండే నిధి నిక్షేపాలు, వాటి వెనుక రహస్యాలు, దైవ నిర్ణయాలు.. తదితర అంశాల మేళవింపుగా రూపొందుతున్న పానిండియా మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ ‘నాగబంధం’. విరాట్‌కర్ణ కథానాయకుడిగా, అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి కిశోర్ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మాతలు. నభా నటేష్, ఐశ్వర్యమీనన్ కథానాయికలు. జులై 3న సినిమా విడుదల కానున్నది.
ఈ సందర్భంగా ఈ సినిమా ప్రచారాన్ని భిన్నంగా మేకర్స్ ప్లాన్ చేశారు. ట్రెజర్ హంట్ నేపథ్యంలో రూపొందుతున్న సినిమా కావడంతో దానికి తగ్గట్టుగా ప్రచార యాత్రను రూపొందించారు. ప్రతి నగరంలో జరిగే ఈ కార్యక్రమం ద్వారా ‘నాగబంధం’ ప్రపంచాన్ని, అందులోని రహస్యాలను, సాహస అంశాలనూ ప్రేక్షకులకు మరింత చేరువ చేసి, సినిమాపై ఆసక్తిని పెంచనున్నారు.
ఈ నెల 19న హైదరాబాద్‌లో ట్రైలర్ లాంచ్ నిర్వహించి, 20 నుంచి 23 వరకూ ముంబై, చెన్నై, బెంగళూరు, కొచ్చీ నగరాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు మేకర్స్ తెలిపారు. ఈ నెల 26న వారణాసిలో ఈ సినిమాలోని ‘వీర నాగ..’ పాటను విడుదల చేస్తున్నామని, అలాగే ఈ నెల 28న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించి, జూలై 2న ప్రీమియర్షోతో ఈ ప్రమోషనల్ జర్నీని ఘనంగా సెలబ్రేట్ చేయనున్నామని మేకర్స్ ప్రకటనలో పేర్కొన్నారు.