సినిమాల నుంచి ప్రస్తుతం విరామం తీసుకుంటున్నారు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్. ‘లాల్ సింగ్ చద్దా’ విడుదల తర్వాత ఆయన కొత్త సినిమాలేవీ అంగీకరించలేదు. ఎన్నో ఆశలతో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అపజయం పాలవడంతో అమీర్ నిరాశ చెందారు. దీంతో సినిమాలకు విరామం ఇచ్చి కుటుంబంతో గడిపేందుకు సమయం వెచ్చిస్తానని గతంలోనే వెల్లడించారు. ఇటీవల ఓ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న అమీర్ ఖాన్ మాట్లాడుతూ…‘ఎప్పుడు కొత్త సినిమా ప్రకటిస్తానా అనే ఉత్సుకత మీలో ఉండి ఉంటుంది.
అయితే ఇప్పుడు అందుకు నేను సిద్ధంగా లేను. ప్రస్తుతం కుటుంబంతో కొంతకాలం గడపాలనుకుంటున్నాను. కొన్నేండ్లుగా నేను వరుసగా సినిమాల్లో నటిస్తూ ఫ్యామిలీకి దూరమయ్యాను. ఆ లోటు ఇప్పుడు తీర్చుకుంటున్నా. నేను చేస్తున్నది సరైనదే. మానసికంగా సిద్ధమయ్యాక నా కొత్త చిత్రాన్ని ప్రకటిస్తా’ అని చెప్పారు. నటనకు దూరంగా ఉన్న అమీర్ ఖాన్ తన ప్రొడక్షన్లో ‘ఛాంపియన్స్’ అనే చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.