Aa Gang Repu 3 Short Film | వైరల్ షార్ట్ ఫిల్మ్ ‘ఆ గ్యాంగ్ రేపు’ సిరీస్ నుంచి మూడో భాగం, ‘ఆ గ్యాంగ్ రేపు-3’ ట్రైలర్ విడుదలైంది. ఇది త్వరలోనే ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇంతకు ముందు 45 మిలియన్లకు పైగా వ్యూస్‌తో ‘ఆ గ్యాంగ్ రేపు’ వైరల్ అవగా, దానికి కొనసాగింపుగా వచ్చిన ‘ఆ గ్యాంగ్ రేపు-2’ కూడా విమర్శకుల ప్రశంసలు పొందింది. దర్శకుడు యోగి కుమార్ ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను ఎంతో భావోద్వేగంగా, వాస్తవానికి దగ్గరగా, ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా తెరకెక్కించారు. గతంలో ఆయన దర్శకత్వం వహించిన తొలి ఫీచర్ ఫిల్మ్ ‘లవ్ యూ టూ’ కూడా ఓటీటీలో మంచి ఆదరణ పొందింది. ‘ఆ గ్యాంగ్ రేపు-3’తో దర్శకుడిగా తనకు మరింత గుర్తింపు వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో నరేన్ అన్నసాగరం మరియు ప్రీతి సుందర్ హీరో హీరోయిన్లుగా నటించారు.
సహచర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నోక్షియస్ నాగ్స్ నిర్మించిన ఈ చిత్రానికి, నాని ఐనవెల్లి అందించిన హ్యాండ్ హెల్డ్ స్టైల్ సినిమాటోగ్రఫీ విజువల్స్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చింది. కథన వేగం, మూడ్‌ను పక్కాగా నిలబెట్టిన ఎడిటర్ అనిల్ కుమార్ జల్లు ఎడిటింగ్, సినిమా టెన్షన్‌ను అద్భుతంగా పటిష్టం చేసింది. 2017లో మొదటి SIIMA షార్ట్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్న, కన్నడ హిట్ ‘షుగర్ ఫ్యాక్టరీ’కి సంగీతం అందించిన కబీర్ రఫీ అందించిన నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్, విడుదల తేదీ త్వరలో ప్రకటించబడతాయి.
ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో నటుడు, కొరియోగ్రాఫర్ ఆటా సందీప్ మాట్లాడుతూ.. ‘ఆ గ్యాంగ్ రేపు’ షార్ట్ ఫిల్మ్‌గా వైరల్ అయ్యింది. దాని రెండో భాగంలో నేను నటించాను, అది కూడా బాగా హిట్టయ్యింది. ‘ఆ గ్యాంగ్ రేపు 3’ కోసం కూడా అడిగారు, కానీ నేను ఒప్పుకోలేదు. నేను కొరియోగ్రాఫర్‌గానే ఉండాలనుకుంటున్నాను. ఇంత బోల్డ్‌గా ఉన్న పాత్రను చేయాలనుకోలేదు. అందుకే ఈ సినిమా చేయలేదు. చాలా కారణాలతో ఈ సినిమా చేయలేదు. ఈ టీమ్‌తో నాకు చాలా మంచి స్నేహం ఉంది. ఫీచర్ ఫిలిం చేసి, కథ నచ్చి ఓటీటీ కోసం మంచి ప్యాషన్‌తో ఈ సినిమా చేశారు. ఈ ట్రైలర్ చాలా బోల్డ్‌గా ఉంది. నేడు సమాజంలో జరుగుతున్న పరిణామాలను కూడా ఈ సినిమాలో దర్శకుడు చర్చిస్తున్నాడు. తప్పకుండా ఈ సినిమా ఓటీటీలో అందరి ఆదరణ పొందాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ.. “2015లో అనుకోకుండా నా చిన్న ప్రయత్నం వైరల్ అయ్యి గుర్తింపు తెచ్చింది. ‘ఆ గ్యాంగ్ రేపు 2’ కూడా హిట్టయ్యింది. నా స్నేహితుడు ఈ సినిమాను నిర్మించాడు. ‘ఆ గ్యాంగ్ రేపు 3’ టైటిల్‌కు మంచి గుర్తింపు ఉంది. నిర్మాత నన్ను నమ్మి బాగా ఖర్చు పెట్టాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో చేసిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుంది. అందరినీ అలరించే సన్నివేశాలు ఈ చిత్రంలో చాలా ఉంటాయి. ఆటా సందీప్ ‘ఆ గ్యాంగ్ రేపు’, ‘ఆ గ్యాంగ్ రేపు 2’లో నటించాడు. కానీ ఈ సినిమాలో ఆయనను విలన్‌గా చేయించడం నాకు ఇష్టం లేదు, అందుకే చేయించలేదు. అందుకే కొత్తవాళ్లతో చేశాను” అని అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ.. “ట్రైలర్లోనే దర్శకుడి విజన్ అర్థమవుతుంది. మంచి టీమ్‌తో చేసిన సినిమా ఇది. యోగి నాకు మంచి స్నేహితుడు. దర్శకుడిని నమ్మి ఈ సినిమా చేశాను. కొత్త టీమ్‌తో చేశాం. ఈ సినిమా ప్రాసెస్‌లో నాకు ఈ చిత్రంపై ఇష్టం పెరిగింది. ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ ఎంతో కష్టపడి పనిచేశారు. అందరి హార్డ్‌వర్క్‌తో సినిమా తప్పకుండా విజయవంతం అవుతుంది” అని అన్నారు. ఈ సమావేశంలో ఈ చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు కూడా పాల్గొన్నారు.
నరేన్ అన్నసాగరం, ప్రీతి సుందర్, సందీప్ సాండిలియా, దయానంద్ రెడ్డి, మహిపాల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సహచర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నోక్షియస్ నాగ్స్ నిర్మాతగా, యోగి కుమార్ దర్శకుడిగా, నాని ఐనవెల్లి డీఓపీగా, కబీర్ రఫీ సంగీతం, అనిల్ కుమార్ జల్లు ఎడిటర్‌గా వ్యవహరించారు.