A.R. Murugadoss | తమిళ దర్శకుడు మురుగదాస్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఆయన దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం గజినితెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఇదే చిత్రం బాలీవుడ్లో అమీర్‌ఖాన్‌తో తెరకెక్కించాడు మురుగదాస్. హిందీలో కూడా ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన తుపాకి, కత్తి వంటి డబ్బింగ్ చిత్రాలను కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. అయితే ఆయన తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన స్పైడర్ చిత్రం మాత్రం అనుకున్న విజయం సాధించలేదు.
మహేష్‌బాబు హీరోగా రూపొందిన ఈ చిత్రం అప్పట్లో డిజాస్టర్‌గా నిలిచింది. అయితే మురుగదాస్ కథకుడుగా ఎప్పుడు ఫెయిల్ కాలేదు. ఆయన కథలు అందరిని ఆలోచింపజేసే విధంగా వుంటాయి. అయితే కథకుడుగా తను సముపార్జించిన నాలెడ్జ్ అంతా పుస్తకాలతోనే అని చెబుతున్నాడు మురుగదాస్. ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు.
” పుస్తకాలు చదవడం అనేది నాకు ఓ వ్యసనంలా మారిపోయింది. ఎంతలా అంటే ఎదో ఒక పుస్తకం చదవనిది నాకు ఇప్పటికీ నిద్రరాదు. ఒక విధంగా చెప్పాలంటే నా స్నేహితులు నన్ను పుస్తకాలా పురుగు అంటారు. నా చేతిలో ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం వుండాల్సిందే. మొబైల్‌ను మరిచిపోతానేమో కానీ పుస్తకాన్ని మాత్రం మరిచిపోను. ఓషో పుస్తకాలు ఎక్కువగా చదువుతుంటాను. జయమెహన్, వైరముత్తు, భారతియార్ వంటి సాహిత్యం అంటే చాలా ఇష్టం.అంతేకాదు మార్కెట్లోకి వచ్చిన ఏ మంచి పుస్తకం వదిలిపెట్టను. ఎక్కడైనా పుస్తక ప్రదర్శనలు జరిగితే అక్కడ వాలిపోతాను. పుస్తకాలు చదవడం అనేది నాకున్న మంచి వ్యసనం” అని చెప్పుకొచ్చారు మురుగదాస్. సోషల్‌మీడియా ప్రభావంతో పుస్తకాలకు ఆమడ దూరంలో వుండే ఈ రోజుల్లో పుస్తక పఠనం అనేది అలవాటుగా, వ్యసనంగా మార్చుకున్న మురుగదాస్ ఎంతైనా గ్రేట్ కదా అంటున్నారు అందరూ.