దసరా సందర్భంగా విడుదలైన సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘వేట్టయాన్’ చిత్రం చక్కటి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. సినిమా విజయాన్ని పురస్కరించుకొని చిత్ర దర్శకుడు టీజే జ్ఞానవేల్ మాట్లాడుతూ ‘ఎన్కౌంటర్లు, న్యాయవ్యవస్థ చుట్టూ ఈ కథ నడుస్తుంది. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్కౌంటర్ హత్యల గురించి చాలా వార్తలు చదివాను. వాటిలో వాస్తవమెంత? అలా చేయడం కరెక్టేనా? అనే అంశాలను ఈ సినిమాలో చూపించాను. ఎర్రచందనం స్మగ్లర్లు అంటూ కట్టెలు కొట్టుకునే అమాయకుల్ని ఎన్కౌంటర్ చేసిన ఘటన నన్ను కదిలించింది. పేదలు మాత్రమే తరచూ ఇలాంటి ఎన్కౌంటర్లకు గురవుతున్నారని, సంపన్నులు చట్టం నుంచి తప్పించుకుంటున్నారని నా పరిశోధనలో తెలిసింది. ఈ విషయాలన్నింటిని ఈ సినిమాలో చర్చించా’ అన్నారు. రజనీకాంత్ అభిమానులు ఇష్టపడే అంశాలతో పాటు సామాజిక స్పృహ ఉన్న కథతో సినిమా తీశానని తెలిపారు. ‘వేట్టయాన్’కు ప్రీక్వెల్ చేయాలనుకుంటున్నానని టీజే జ్ఞానవేల్ పేర్కొన్నారు.