SIP | పక్కా ప్లాన్.. దానికి తగ్గ పట్టుదల ఉంటే.. మనలో ఎవరైనా కోటీశ్వరులం కాగలం. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)తో పదేండ్లలోనే కరోడ్‌పతి కావచ్చు మరి. అయితే కోటి రూపాయల కార్పస్ ఫండ్‌ను నిర్మించుకోవడమనేది మాత్రం అందరికీ అంత సులువుగా కుదిరేది కాదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి చాలా ఓపిక.. అంతకుమించి నిర్దిష్టమైన లక్ష్యం తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే కోటి రూపాయల కల నెరవేరేది.
నెలనెలా ఎంతంటే..
కోటి రూపాయల కార్పస్ ఫండ్‌ను కేవలం పదేండ్లలోనే దక్కించుకోవాలంటే నెలనెలా రూ.40 నుంచి 50 వేలు అవసరం ఉంటుంది. ఈ మొత్తాన్ని సిస్టమ్యాటిక్ పద్ధతుల్లో ఇన్వెస్ట్ చేయాలి. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సాధారణ ఉద్యోగులకు నెలనెలా 40, 50 వేల రూపాయలు పొదుపు చేయడమనేది తలకు మించిన భారం. అయినప్పటికీ నేటి యువతకు ఆకర్షణీయ ప్యాకేజీలే ఉంటున్నాయి కాబట్టి దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇక కోటి రూపాయల మైలురాయిని చేరుకోవాలంటే నెలకు కనీసంగా రూ.49,700 వరకూ పొదుపు చేయాలి. అదికూడా 10 శాతం వరకూ ప్రతిఫలం వస్తుందనే అంచనాతో. ఒకవేళ 11 శాతం రిటర్న్స్ వస్తాయనుకుంటే నెలకు రూ.47,100, 12 శాతంతో నెలకు రూ.44,700 నెలనెలా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతుల్లో పదేండ్లపాటు మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. రాబడులు ఎక్కువగా ఉంటే.. మనం నెలనెలా పొదుపు చేయాలనుకుంటున్న మొత్తం కూడా తగ్గుతుంది. కానీ కనిష్ఠంగా 10 శాతం, గరిష్ఠంగా 15 శాతానికి మించి మనం లెక్కించుకోవడం సరైన పద్ధతి కాదు.
చివరగా..
సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పెట్టుబడులు స్టాక్ మార్కెట్ ఆధారంగా ఉంటాయి. వివిధ మ్యూచువల్ ఫండ్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి మార్కెట్ ఒడిదుడుకులు సహజం. దీన్ని దృష్టిలో పెట్టుకొనే మదుపరులు ఓ నిర్ణయానికి రావడం ఉత్తమం.
-నాగేంద్రసాయి కుందవరం
వడ్డీతో భరోసా
ముందుగా పదేండ్లపాటు మనం మన ఫండ్ జోలికి వెళ్లకూడదు. ఏదైనా పెద్ద గండం వస్తే తప్ప దాన్ని ముట్టుకోరాదు. అప్పుడే లక్ష్యం చేరుకోవచ్చు. ఇక కోటి రూపాయల ఫండ్ బ్యాంకులో ఉంటే మనం ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటామో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఒక్కసారి కోటి రూపాయల కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేసుకున్నాక.. కనీసం 10 శాతం రిటర్న్స్ వచ్చినా నెలకు రూ.80 వేలదాకా వడ్డీనే పొందవచ్చు. ఇది మనకు, మన కుటుంబానికి ఎంతటి భరోసా, నమ్మకాన్ని ఇస్తుందో ఒక్కసారి మీరే ఆలోచించండి.