న్యూఢిల్లీ, అక్టోబర్ 28: బ్యాంక్‌లకు ఎగవేస్తున్న రుణాల మొత్తం గణనీయంగా పెరిగిపోతున్నది. కేవలం నాలుగేండ్లలో ఉద్దేశపూర్వక ఎగవేతదార్లు బ్యాంక్‌లకు చెల్లించాల్సిన మొత్తం రూ.1.2 లక్షల కోట్ల మేరకు పేరుకుంది. తాజా డేటా ప్రకారం విల్‌ఫుల్ డిఫాల్టర్లు టోపీ వేస్తున్న సొమ్ము 2019 మార్చి నుంచి దాదాపు రోజుకు రూ.100 కోట్ల చొప్పున పెరుగుతున్నదని బిజినెస్ స్టాండర్డ్ ఒక కథనంలో తెలిపింది. ట్రాన్స్‌యూనియన్ సిబిల్ గణాంకాల ప్రకారం 2019 మార్చి నుంచి ఉద్దేశపూర్వక ఎగవేతదారులు బ్యాంక్‌లకు బకాయిపడిన సొమ్ము 50 శాతంపైగా పెరిగి, 2023 జూన్ నాటికి మొత్తం బకాయిలు రూ. 3 లక్షల కోట్లకు చేరాయి. చెల్లించగలిగే సామర్థ్యం ఉండికూడా రుణాల్ని ఎగవేసేవారిని ఉద్దేశపూర్వక ఎగవేతదార్లుగా వ్యవహరిస్తారు. ఏదైనా రుణ ఖాతా మొండి బకాయిగా (ఎన్పీఏ) మారిన ఆరు నెలల్లోగా ఆ ఖాతాదారును ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించాలని ఇటీవల రిజర్వ్‌బ్యాంక్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై అక్టోబర్ చివరినాటికల్లా పబ్లిక్ వ్యాఖ్యానాల్ని తెలపాలంటూ ఆర్బీఐ కోరింది. ప్రస్తుతం విల్‌ఫుల్ డిఫాల్టర్‌గా ప్రకటించడానికి సమయ నిర్దేశమేదీ లేదు.
ఉద్దేశపూర్వక ఎగవేతలు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లోనే అధికంగా జరుగుతున్నది. 2023 జూన్‌నాటికి విల్‌ఫుల్ డిఫాల్టర్లు చెల్లించాల్సిన మొత్తంలో 77.5 శాతం ప్రభుత్వ బ్యాంక్‌లవే. ఇటువంటి రుణాల్లో ప్రైవేటు బ్యాంక్‌లు, ఇతర ఆర్థిక సంస్థల వాటా గత నాలుగేండ్లలో స్వల్పంగా పెరిగింది. ఈ ఏడాది జూన్‌నాటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల బకాయిలు రూ.80,000 కోట్లు ఉండగా, ఇతర పది జాతీయ బ్యాంక్‌లకు రూ.1.5 లక్షల కోట్ల మేరకు రావాల్సి ఉంది. ప్రైవేటు రంగ బ్యాంక్‌లకు విల్‌ఫుల్ డిఫాల్టర్లు ఎగవేసిన మొత్తం రూ. 53,500 కోట్ల మేర ఉంది.
విల్‌ఫుల్ డిఫాల్టర్లు బ్యాంక్‌లకు ఎగవేసిన మొత్తం..దేశంలోని అన్ని రాష్ర్టాలకంటే మహారాష్ట్రలో అధికంగా ఉంది. 2019 మార్చి నుంచి మహారాష్ట్రలోని ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల బకాయి మొత్తం రూ.60,000 కోట్ల నుంచి రూ.1.30 లక్షల కోట్లకు చేరింది. ఈ తరహా రుణాల్లో 70 శాతం టాప్ ఫైవ్ రాష్ర్టాలైన మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, గుజరాత్, తమిళనాడుల్లో పేరుకుపోయింది. గత నాలుగేండ్లలో ఢిల్లీలోనైనే ఉద్దేశపూర్వక ఎగవేత మొత్తం 200 శాతం పెరిగి రూ.60 వేల కోట్లకు చేరగా, మిగిలిన రాష్ర్టాల్లో ఈ పెరుగుదల 95 శాతం మేర ఉన్నది.