ముంబై, జనవరి 9: దేశంలో వైట్ కాలర్ ఉద్యోగ నియామకాలు తగ్గుముఖం పట్టాయి. 2022 డిసెంబర్‌తో పోల్చితే 2023 డిసెంబర్లో 16 శాతం పడిపోయినట్టు తేలింది. ఐటీ, బీపీవో, విద్య, రిటైల్, ఆరోగ్య సంరక్షణ రంగాల్లోని కంపెనీలు ఆచితూచి అడుగులు వేస్తుండటమే ఇందుకు కారణమని మంగళవారం విడుదలైన నౌకరీ.కామ్ సర్వే చెప్తున్నది. ‘ఐటీయేతర రంగాల్లో గత ఏడాది నవంబర్‌తో పోల్చితే డిసెంబర్లో నియామకాలు 2 శాతం పెరిగినట్టు మేము గమనించాం. అయితే ఐటీ రంగంలో ఈ రకమైన పరిస్థితులు లేవు. దీనివల్లే డిసెంబర్లో ఓవరాల్ ఇండెక్స్ 16 శాతం దిగజారింది. చూస్తుంటే ఐటీ రంగంలో హైరింగ్ తిరిగి పుంజుకోవాలంటే చాలా సమయమే పట్టేలా ఉన్నది’ అని నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్‌ను విశ్లేషిస్తూ నౌకరీ.కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ అన్నారు.
ఇదీ సంగతి..
నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ వివరాల ప్రకారం 2022 డిసెంబర్‌తో పోల్చితే గత నెల బీపీవో రంగంలో 17 శాతం నియామకాలు తగ్గాయి. ఆ తర్వాత ఎడ్యుకేషన్, రిటైల్ రంగాల్లో 11 శాతం చొప్పున హైరింగ్ కార్యకలాపాలు నీరసించాయి. హెల్త్‌కేర్ రంగంలోనూ 10 శాతం కొత్త ఉద్యోగ నియామకాలు పడిపోయినట్టు స్పష్టమైంది. ఇక ఐటీ రంగంలో అత్యధికంగా 21 శాతం హైరింగ్ యాక్టివిటీస్ క్షీణించాయి. 2023 నవంబర్‌తో చూసినా 4 శాతం తగ్గాయి. దేశ, విదేశీ ఆర్థిక వ్యవస్థల్లో చోటుచేసుకుంటున్న ప్రతికూల మార్పులు.. ఆయా రంగాల్లోని హైరింగ్ కార్యకలాపాలకు బ్రేక్ వేస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా అమెరికా, ఐరోపాల్లో భారతీయ ఐటీ సంస్థలకు తగ్గిన ప్రాజెక్టుల ప్రభావం.. జాబ్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తున్నట్టు వారు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే 2023లో ఐటీ రంగానికి గడ్డు కాలం నడిచిందని, కేవలం 700 ఉద్యోగాలే పెరిగాయని గుర్తుచేస్తున్నారు. 2022లో ఏకంగా 2.67 లక్షల ఉద్యోగ నియామకాలు జరిగాయని చెప్తున్నారు. ఆయా సంస్థలు చేపట్టిన లేఆఫ్‌లు.. హైరింగ్ సెంటిమెంట్‌ను బాగా దెబ్బతీశాయన్న అభిప్రాయాలూ గట్టిగా వినిపిస్తున్నాయి. కృత్రిమ మేధస్సు వినియోగం పెరుగుతుండటంతో కంపెనీలు మ్యాన్ పవర్‌ను తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాయని ఇండస్ట్రీ నిపుణులు ప్రస్తుత పరిస్థితుల్ని విశ్లేషిస్తున్నారు.
ఈ రంగాల్లో దూకుడు..
డాటా సైంటిస్టులు, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీర్లు, ఆటోమేషన్ ఇంజినీర్లకు గిరాకీ బాగుందని తాజా సర్వే వెల్లడించింది. ఐటీ ఇండస్ట్రీలో నియామకాలు అరకొరగా ఉన్నా.. ఇక్కడ మాత్రం హైరింగ్ పెద్ద ఎత్తున సాగుతున్నదని చెప్పింది. అయితే చమురు, గ్యాస్ రంగంలో కొత్త ఉద్యోగావకాశాలు ఆశించిన స్థాయిలో లేవన్న నౌకరీ.కామ్.. ఆతిథ్య రంగంలో మాత్రం 4 శాతం పెరిగినట్టు తెలిపింది. ఈ రంగంలో ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్లలో ఉద్యోగ వృద్ధి బాగున్నది. ఇక ఔషధ రంగంలోనూ హైరింగ్ 2 శాతం పెరగగా.. అహ్మదాబాద్, వడోదర, ముంబైల్లో గరిష్ఠ వృద్ధి కనిపించింది.
హైదరాబాద్‌లో డౌన్
హైదరాబాద్‌లో గత నెల హైరింగ్ కార్యకలాపాలు మందగించినట్టు ఈ సందర్భంగా నౌకరీ.కామ్ తెలియజేసింది. డిసెంబర్లో ఆయా రంగాల్లో ఉద్యోగ నియామకాలు 23 శాతం పడిపోయినట్టు ప్రకటించింది. నిజానికి కేసీఆర్ ప్రభుత్వంలో రాష్ట్ర ఐటీ రంగం కొత్త పుంతలు తొక్కిన విషయం తెలిసిందే. ఐటీ ఎగుమతుల్లోనూ బెంగళూరుకు గట్టి పోటీనిచ్చిన సంగతీ విదితమే. ఆఫీస్ స్పేస్‌లో, యువకుల్లో నైపుణ్యం-ప్రతిభకు సంబంధించైనా, ప్రభుత్వం తరఫున అందే మద్దతులోగానీ లోటన్నదే లేదు. దీంతోనే ఇక్కడి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు దక్కాయి. ఇది యావత్తు పరిశ్రమే అంగీకరించింది. అయితే కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తొలి నెలే.. ఉద్యోగ నియామకాల్లో ఈ క్షీణత ఇప్పుడు మిక్కిలి ప్రాధాన్యాన్ని దక్కించుకోగా.. అంతకుమించి అటు మార్కెట్, ఇటు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నది.