న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3 : సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్.. గురువారం బిల్ పేమెంట్స్‌ను ప్రారంభించింది. వినియోగదారులు ఇక తమ విద్యుత్, గ్యాస్, వాటర్, క్రెడిట్ కార్డుల బిల్లులతోపాటు మొబైల్, ఇంటర్నెట్ రిచార్జ్‌లు, ఫాస్టాగ్ పేమెంట్స్, బీమా ప్రీమియంలు, రుణాల చెల్లింపులు తదితర యుటిలిటీ పేమెంట్స్‌ను మరింత సులభంగా చేసుకోవచ్చు. అలాగే వాట్సాప్ ద్వారా ఒకే బిల్లర్తో యూజర్లు వేర్వేరు ఖాతాలనూ నిర్వహించుకోవచ్చు.
మీ వ్యక్తిగత పేమెంట్స్‌తోపాటు కుటుంబ సభ్యులు, మిత్రుల కోసం కూడా బిల్ పేమెంట్స్ సౌకర్యం ఉంటుంది. కాగా, భారత్ కనెక్ట్ (బీబీపీఎస్) నెట్‌వర్క్‌తో అనుసంధానమైన ఈ మేసేజింగ్ యాప్‌పై 30 కేటగిరీల్లో 22,722 బిల్లర్స్‌కు సేవలు అందుతాయి. ప్రస్తుతానికైతే దశలవారీగా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుండగా.. కొద్ది వారాల్లోనే దేశవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లందరికీ చేరువ అవుతుందని మెటా ఇండియా అధిపతి, ఎండీ అరున్ శ్రీనివాస్ చెప్తున్నారు.
గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం తరహాలోనే నగదు బదిలీలు, క్యూఆర్ కోడ్ స్కానింగ్, పేమెంట్స్ చరిత్ర, అకౌంట్ బ్యాలెన్స్ అన్నింటి వివరాలను తెలుసుకోవచ్చు.