విభిన్న సాంస్కృతిక, సంప్రదాయాలకు నెలవైన హైదరాబాద్.. స్వరాష్ట్రంలో వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో పరుగులు పెడుతున్నది.
అనేక రంగాలకు చెందిన ఎన్నో బహుళజాతి సంస్థలు తెలంగాణ రాజధాని నగరంలో కొలువుదీరుతున్నది చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, ఔషధ, జీవ శాస్ర్తాల రంగాల్లో హైదరాబాద్ పాత్ర ఏమిటన్నది ఈ ఎనిమిదిన్నరేండ్లలో యావత్తు ప్రపంచానికి తెలిసింది.
అందుకే ఈ ఔషధ నగరిలో హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్లపై దేశంలోనే తొలి ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సెంటర్ (సీ4ఐఆర్)ను వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏర్పాటు చేస్తున్నది.
హైదరాబాద్, జనవరి 16: ప్రపంచ ఆర్థిక మండలి (డబ్ల్యూఈఎఫ్) నాల్గో పారిశ్రామిక విప్లవం నెట్‌వర్క్‌లో తెలంగాణ కూడా చేరింది. హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్లపై ప్రధానంగా దృష్టిపెట్టేలా సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ (సీ4ఐఆర్) హైదరాబాద్‌లో ఏర్పాటవుతున్నది. ఆరోగ్య సంరక్షణ, జీవ శాస్ర్తాలే నేపథ్యంగా దేశంలో డబ్ల్యూఈఎఫ్కున్న ఏకైక సెంటర్ ఇప్పుడు సీ4ఐఆర్ తెలంగాణలోనే. ఇది డబ్ల్యూఈఎఫ్‌కు 18వ కేంద్రం. తాజా నిర్ణయంతో 4ఐఆర్ సెంటర్ల గ్లోబల్ నెట్‌వర్క్‌లో తెలంగాణ ప్రధానం కానున్నది. అంతేగాక అంతర్జాతీయ స్థాయికి ఇక్కడి నాయకత్వం విస్తరించనున్నది.
ఇక ఈ తొలి హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ 4ఐఆర్ సెంటర్.. జెనోమిక్స్, వ్యక్తిగత ఔషధాలు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల తయారీ వంటి కొత్త టెక్నాలజీల్లో మరింత ప్రగతి కోసం శ్రమించనున్నది. మెరుగైన జీవశాస్త్ర, సాంకేతికతల సాయంతో కొత్త ఉత్పత్తులకు శ్రీకారం చుట్టనున్నది. ఇదిలావుంటే తెలంగాణ రాష్ట్ర ప్రగతిదాయక పారిశ్రామిక విధానాలకు విశ్వవ్యాప్త గుర్తింపు లభించిందని దీని రాక నిదర్శనమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక్కడి ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి కూడా మరింత ప్రాచుర్యం పొందాయంటున్నారు.
ఇదీ.. చరిత్ర
2016లో డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపక, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ క్లాజ్ ష్వాబ్ ‘ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్’ పుస్తకాన్ని ప్రచురించారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా వస్తున్న సాంకేతిక మార్పులను మరింతగా అర్థం చేసుకొనేలా శాన్ఫ్రాన్సిస్కోలో సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్‌ను 2017లో డబ్ల్యూఈఎఫ్ ఏర్పాటు చేసింది. 2018లో జపాన్, భారత్‌లకు సీ4ఐఆర్ నెట్వర్క్ తొలి రెండు సభ్యత్వాలు దక్కాయి. సాంకేతిక పాలన, రంగాలవారీగా దాని బదిలీ కోసం 2022లో ప్రపంచవ్యాప్తంగా 16 సెంటర్లు వచ్చాయి. 30కిపైగా లక్ష్యాలతో ముందుకెళ్తున్న ఈ సీ4ఐఆర్ నెట్‌వర్క్‌లో 200 మందికిపైగా విధాన, పాలనా నిపుణులున్నారు. అలాగే 350కిపైగా ఇన్నోవేటర్లు, టెక్నాలజీ పయనీర్లున్నారు.
– బిజినెస్ డెస్క్
ఇందుకే ఇక్కడ ఏర్పాటు