Oracle Layoffs : అమెరికాకు చెందిన టెక్ సంస్థ ఒరాకిల్ తమ భారతీయ ఉద్యోగులకు షాకిచ్చింది. దాదాపు 12,000 మందిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం లేనప్పటికీ 12,000 మంది ఉద్యోగుల్ని తొలగిస్తూ ఒరాకిల్ కార్పొరేషన్.. సిబ్బందికి మెయిల్స్ పంపినట్లు సమాచారం. అయితే, ఒరాకిల్ సంస్థ ఇండియానుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్ని తొలగించాలని నిర్ణయించింది.
దాదాపు 30,000 మంది సిబ్బందిని తొలగించాలని నిర్ణయించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. సిబ్బందిని తగ్గించుకోవాలనే ప్రణాళికలో భాగంగా తొలగింపుల ప్రక్రియను కంపెనీ కొనసాగిస్తోంది. అయితే, విధుల నుంచి తొలగించనున్న ఉద్యోగులకు కంపెనీ ప్రత్యేక పరిహార ప్యాకేజీని అందించనున్నట్లు తెలుస్తోంది. వాలంటరీ రెసిగ్నేషన్ ఇచ్చిన వారికి అదనపు శాలరీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీ వంటివి కంపెనీ అందించనుంది. సంస్థలో ఒక ఏడాది పూర్తి చేసుకున్నవారికి 15 రోజుల వేతనం అందించనుంది. అలాగే, నోటీస్ పీరియడ్‌కు అనుగుణంగా ఒక నెల వేతనం అందుతుంది. గరిష్టంగా ఉద్యోగులకు అదనంగా రెండు నెలల వేతనం అందించనుంది.
సంస్థాగత పునర్వ్యస్థీకరణలో భాగంగా ఈ తొలగింపులు చేపట్టినట్లు ఉద్యోగులకు పంపిన మెయిల్లో కంపెనీ తెలిపింది. ఒరాకిల్ సంస్థకు ఇండియాలో 30,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇతర దేశాల్లోనూ మరికొందరు ఉద్యోగుల్ని నెలలోపే తొలగించాలని నిర్ణయించింది. ఇటీవల ఓపెన్ఏఐ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా ఒరాకిల్ సంస్త ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అంటున్నాయి.