BOM Interest Rates | ఇండ్ల కొనుగోలుదారులు, కార్ల వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకు.. బ్యాంక్ మహారాష్ట్ర (బీవోఎం) గుడ్‌న్యూస్ చెప్పింది. ఆల్‌టైం రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికే ఇండ్ల రుణాలు ఇవ్వనున్నట్లు ఆదివారం ప్రకటించింది. రిటైల్ బొనాంజ-ఫెస్టివ్ ధమాకా ఆఫర్లో భాగంగా ఇప్పటి వరకు అమలులో ఉన్న 6.80 శాతం వడ్డీరేటును 6.40 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇంతకుముందు 6.40 శాతం వడ్డీరేటుపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండ్ల రుణాలు అందిస్తున్నట్లు ప్రకటించింది.
అలాగే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.. కార్ల కొనుగోలుదారులను ఆకర్షించడానికి వడ్డీరేట్లను 7.05 శాతం నుంచి 6.80 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. అయితే, ఈ వడ్డీరేట్లు అందరికీ వర్తించబోవని స్పష్టం చేసింది. రుణ గ్రహీతల క్రెడిట్ స్కోర్ ఆధారంగా రిటైల్ బోనంజా-ఫెస్టివ్ ధమాకా ఆఫర్ వర్తింపజేస్తామని వివరించింది. సోమవారం (డిసెంబర్ 13) నుంచి ఈ వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
ఇప్పటికే బంగారం, ఇండ్లు, కార్ల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రద్దు చేసింది. తమ కస్టమర్ల జీవితాల్లో ఆనందోత్సాహాలు నింపేందుకే వడ్డీరేట్లు తగ్గించడానికి రిటైల్ బోనంజా-ఫెస్టివ్ ధమాకా ఆఫర్ తెచ్చామని బ్యాంక్ ఎండీ ఏఎస్ రాజీవ్ ఓ ప్రకటనలో తెలిపారు.