PNB Attractive interest rates | ఆకర్షణీయ వడ్డీరేట్లకే కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) వివిధ రుణాలు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఐదు బేసిక్ పాయింట్లు తగిస్తున్నట్లు తెలిపింది. దీంతో మరింత చౌక వడ్డీరేటుకే ఇండ్ల రుణాలు, కార్ల రుణాలు ఇస్తున్నట్లు పేర్కొంది. పండుగల సీజన్లో వివిధ రుణాలు మరింత చౌకగా అందజేస్తున్నట్లు వెల్లడించింది.
ఈ నెల 8 నుంచి కార్లను కొనుగోలు చేసే వారికి 6.65 శాతం వడ్డీకే రుణాలు మంజూరు చేస్తున్నామని పీఎన్బీ తెలిపింది. ఎలక్ట్రిక్, సీఎన్జీ కార్లపై 6.65 శాతం వడ్డీకే రుణలిస్తామని పేర్కొంది. ఇక 6.50 శాతం వడ్డీరేటుకే ఇండ్ల రుణాలిస్తామని వెల్లడించింది. పండుగల సీజన్లో కస్టమర్ల నుంచి వస్తున్న డిమాండ్‌ను అందుకునేందుకు వడ్డీరేట్లు ఐదు బేసిక్ పాయింట్లు తగ్గించి 8.90 శాతం వడ్డీకి వ్యక్తిగత రుణాలు ఇవ్వనున్నామని పీఎన్బీ వివరించింది.
72 నెలల గడువుతో రూ.20 లక్షల వరకు రుణాలిస్తామని తెలిపింది. డిజిటల్ చానెల్స్ నుంచి రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇండ్ల రుణాలపై అదనంగా ఐదు బేసిక్ పాయింట్లు, కార్ల రుణాలపై 10 బేసిక్ పాయింట్ల వడ్డీ తగ్గిస్తున్నామని వెల్లడించింది. ఇంటర్నెట్ బ్యాంక్, పీఎన్బీ వన్ మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి ఈ మినహాయింపులు వర్తిస్తాయని పేర్కొంది. ఇంకా ఇండ్ల రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలు, ఆస్తి రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు, సర్వీస్ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు పీఎన్బీ తెలిపింది.