Infrastructure sectors | న్యూఢిల్లీ, జూన్ 30: దేశ అభివృద్ధికి కీలకమైన మౌలిక రంగాలు మందగించాయి. ముడి చమురు, సహజవాయువు, విద్యుత్ ఉత్పత్తి తగ్గడంతో 2023 మే నెలలో 8 కీలక మౌలిక రంగాల వృద్ధి రేటు 4.3 శాతానికి పడిపోయింది. 2022 ఏడాదిలో ఇదే నెలలో ఇవి 19.3 శాతం వృద్ధి కనపర్చాయి. ఈ ఏడాది మే నెలలో సైతం వృద్ధి రేటు 4.3 శాతానికే పరిమితమయ్యింది. అలాగే ఈ ఆర్థిక సంవత్సరం మే, ఏప్రిల్ నెలల్లో నిరుడు ఇదేకాలంతో పోలిస్తే వృద్ధి రేటు 14.3 శాతం నుంచి 4.3 శాతానికి క్షీణించింది.
మే నెలలో క్రూడాయిల్ ఉత్పత్తి 1.9 శాతం తగ్గగా, సహజవాయువు, విద్యుత్ ఉత్పత్తి 0.3 శాతం చొప్పున పడిపోయింది. బొగ్గు ఉత్పత్తి గత ఏడాది మేతో పోలిస్తే 33.5 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గింది. రిఫైనరీ ఉత్పత్తులు 28 శాతం నుంచి 2.8 శాతానికి తగ్గాయి. ఎరువుల ఉత్పత్తి 22.9 శాతం నుంచి 9.7 శాతానికి, ఉక్కు ఉత్పత్తి 15.1 శాతం నుంచి 9.2 శాతానికి, సిమెంట్ ఉత్పత్తి 26.2 శాతం నుంచి 15.5 శాతానికి తగ్గింది. వీటికి ఐఐపీలో 40 శాతం వెయిటేజి ఉన్నది.