దీపావళికి, ధనత్రయోదశికి దగ్గరి బంధువులకు, స్నేహితులకు బహుమానాలు ఇవ్వడం ఓ సంప్రదాయం. అయితే ఈ బహుమతులు ఓ పరిమితికి మించితే మాత్రం ఆదాయ పన్ను శాఖకు తెలపాల్సిందే. లేదంటే బహుమానం ఓ సమస్యగా మారుతుంది. నగదు, బంగారం, వెండి ఆభరణాలు, పెయింటింగ్స్, అలంకరణ సామాగ్రి, మ్యూచువల్ ఫండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ) లేదా ఇతర ఆర్థిక సాధనాలేవైనా సరే.. రూ.50 వేలకు మించి విలువైనవైతే ఐటీ శాఖకు చెప్పాల్సిందే. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 56(2) ప్రకారం ఆర్థిక సంవత్సర కాలంలో వచ్చిన బహుమానాలను ఇతర వనరుల ద్వారా వచ్చిన ఆదాయంగా పరిగణిస్తారు.
ఏ గిఫ్టులు పన్ను పరిధిలోకి?
నగదు, వస్తు రూపంలో వచ్చే గిఫ్ట్ ఏదైనా పన్ను పరిధిలోకి వస్తుంది. అయితే వస్తువుల్లో ఆభరణాలు, బులియన్, పెయింటింగ్స్, లేదా విగ్రహాలు రూ.50 వేలకు మించిన విలువను కలిగి ఉంటేనే పన్ను పరిధిలోకి వస్తాయి. ఒకవేళ స్థిరాస్తి అయితే స్టాంప్ డ్యూటీ ఛార్జీలు రూ.50,000 దాటితే పన్ను పరిధిలోకి వస్తుంది. అలాగే సంస్థలు తమ ఉద్యోగులకు ఇచ్చే క్యాష్ గిఫ్ట్లు కూడా పన్ను పరిధిలోకి వస్తాయి. ఈ గిఫ్ట్ తీసుకున్నవారే ఆదాయ పన్నును చెల్లించాల్సి ఉంటుంది.
పన్ను పరిధిలోకి రానివేవి?
ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం బంధువుల నుంచి తీసుకునే గిఫ్టులు పన్ను పరిధిలోకి రావు. అంటే భార్యాభర్తలు, సంతానం, తల్లి లేదా తండ్రి తరఫువాళ్లు ఇచ్చే గిఫ్టులు పన్నుల పరిధిలోకి రావు. ఒక్కమాటలో చెప్పాలంటే కుటుంబ సభ్యుల నుంచి తీసుకునే గిఫ్టులకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే పెండ్లి సందర్భంగా వచ్చే గిఫ్టులు, వంశపారంపర్యంగా సంక్రమించేవి కూడా గిఫ్టు టాక్స్ పరిధిలోకి రావు.