Income Tax Saving options | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) లో గరిష్టంగా పన్ను పొదుపు చేయడం ఎలా అన్న అంశంపై వేతన జీవులు భారీగా కసరత్తు చేస్తున్నారు. పాత, కొత్త పన్ను విధానాల్లో తమకు ఇష్టమైన విధానాన్ని ఎంచుకోవడాన్ని బట్టి పన్ను చెల్లింపు ఎంత వరకు పొదుపు చేయవచ్చో తెలుస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే.. పన్ను మినహాయింపులు, డిడక్షన్లు క్లయిమ్ చేయొచ్చు.
పాత ఆదాయం పన్ను విధానం కింద పలు డిడక్షన్లు, మినహాయింపులు క్లయిమ్ చేయడానికి వెసులుబాటు ఉన్నది. ఆదాయం పన్ను చట్టం -1961 చట్టంలోని 80సీ, 80డీ, 80సీసీడీ (1బీ), హెచ్ఆర్ఏ, ఎల్టీఏ వంటి సెక్షన్ల కింద పన్ను మినహాయింపులు ఫైల్ చేయొచ్చు. కొత్త పన్ను విధానం ఎంచుకుంటే మాత్రం పైన పేర్కొన్న డిడక్షన్లు, మినహాయింపులు క్లయిమ్ చేయలేరు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో వేతన జీవులు పన్ను పొదుపు చేయడానికి పలు పన్ను ఆదా పథకాలు, ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దామా..!
స్టాండర్డ్ డిడక్షన్: ప్రతి వేతన జీవి తన వార్షిక ఆదాయంపై రూ.50 వేల వరకు స్టాండర్డ్ పన్ను మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు. ఈ డిడక్షన్ కోసం సంబంధిత పన్ను చెల్లింపుదారులు ఎటువంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. వేతన జీవులు తమ వేతన ఆదాయం నుంచి నేరుగా డిడక్షన్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నది.
నిర్దిష్ట పెట్టుబడులు, ఖర్చుల కింద ప్రతి వేతన జీవి రూ.1.5 లక్షల వరకు గరిష్ట మినహాయింపు కోరవచ్చు. స్థూల పన్ను ఆదాయంపై రూ.1.5 లక్షల వరకు మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు. స్థూల పన్ను ఆదాయం తగ్గితే, చెల్లించాల్సిన పన్ను కూడా తగ్గుతుంది. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ (ఈపీఎఫ్), పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్, టాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్, ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ తదితర పొదుపు పథకాల్లో పెట్టిన పెట్టుబడులపై పన్ను మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు. పిల్లల పాఠశాల పీజులు, జీవిత బీమా ప్రీమియం, ఇంటి రుణంపై అసలు చెల్లింపు తదితర అంశాలు కూడా దీని కిందకు వస్తాయి.
ఆదాయం పన్ను చట్టంలోని ఈ సెక్షన్ కింద మరో రూ.50 వేల పెట్టుబడిపై పన్ను ఆదా చేయొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)లో రూ.50 వేల వరకు అదనపు డిడక్షన్ క్లయిమ్ చేయొచ్చు. 80సీ సెక్షన్ కింద డిడక్షన్ కంటే ఇది అదనం. అంటే 80సీ, 80సీసీడీ (1బీ) సెక్షన్ల కింద ప్రతి వేతన జీవి గరిష్టంగా రూ.2 లక్షల వరకు డిడక్షన్ క్లయిమ్ చేయొచ్చు.
ఏదైనా ఒక సంస్థ యాజమాన్యం ఎన్పీఎస్ ఖాతాలో భాగస్వామ్యం కల్పిస్తే సంబంధిత సంస్థ ఉద్యోగి.. 80సీసీడీ (2) సెక్షన్ కింద పన్ను మినహాయింపు క్లయిమ్ చేయవచ్చు. ఒక వేతన జీవి తన వేతనంలో 10 శాతం (బేసిక్ శాలరీ ప్లస్ డేర్ నెస్ అలవెన్స్) క్లయిమ్ చేయడానికి వీలు ఉంది. ప్రభుత్వోద్యోగులు 14 శాతం వరకు క్లయిమ్ చేసుకునే వెసులుబాటు లభిస్తుంది.
అయితే ఎన్పీఎస్, ఈపీఎఫ్ వంటి పథకాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో యాజమాన్యాల భాగస్వామ్యం రూ. 7.5 లక్షల కోట్లు దాటితే… అలా దాటిన మొత్తం సొమ్ముపై సంబంధిత ఉద్యోగి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆయా పథకాల్లో గరిష్ట పరిమితిని మించి చేసిన పొదుపుపై వచ్చే డివిడెండ్, వడ్డీ, రిటర్న్స్ ఆదాయంపైనా పన్ను వడ్డిస్తారు.
ఆదాయం పన్ను చట్టం కింద ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం చెల్లింపు కూడా పన్ను మినహాయింపు క్లయిమ్ చేయవచ్చు. వయస్సును బట్టి గరిష్టంగా డిడక్షన్ క్లయిమ్ చేయడానికి వీలు ఉన్నది. ఒక వ్యక్తి 60 ఏళ్ల లోపు వయస్సు గల వారైతే రూ.25 వేలు, సీనియర్ సిటిజన్ అయితే రూ.50 వేల వరకు క్లయిమ్ చేయవచ్చు. ప్రతి వ్యక్తి తన జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలతోపాటు తల్లిదండ్రులకు ఆరోగ్య బీమా పాలసీ చెల్లిస్తే అదనంగా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు క్లయిమ్ చేయొచ్చు.
మీరు మీ వేతనంలో హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) పొందుతున్నారా? దీంతోపాటు అద్దె ఇంట్లో నివసిస్తున్నారా? అయితే మీరు హెచ్ఆర్ఏ కింద పన్ను మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు. పన్ను ఆదా చేయడానికి హెచ్ఆర్ఏ గణించేందుకు ఆదాయం పన్ను చట్టంలో నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి.
ఒకవేళ మీరు ఇంటి రుణం తీసుకున్నారా.. మీరు ఇంటి రుణం అసలు చెల్లింపుపై క్లయిమ్ చేయొచ్చు. సెక్షన్ 24 కింద వడ్డీ చెల్లింపు పైన కూడా పన్ను పొదుపు చేయొచ్చు. ఈ సెక్షన్ కింద గరిష్టంగా రూ.2 లక్షల వరకు పొదుపు చేయొచ్చు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్ను విధానం కింద వేతన జీవులు పన్ను ఆదా చేయడానికి సాధారణ డిడక్షన్లను అనుమతించరు. కేవలం ఆదాయం పన్ను చట్టంలోని 80సీసీడీ (2) సెక్షన్ కింద మాత్రమే పన్ను మినహాయింపు కోరవచ్చు. ఈ డిడక్షన్ పాత, కొత్త ఐటీ విధానంలో అందుబాటులో ఉంది. ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతాలో యాజమాన్యం భాగస్వామ్యాన్ని బట్టి డిడక్షన్ లింక్ చేశారు. ప్రైవేట్ సంస్థ ఉద్యోగికి గరిష్టంగా 10 శాతం, ప్రభుత్వోద్యోగులకు 14 శాతం మినహాయింపు లభిస్తున్నది.