దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) ప్రధాన మైలురాయిని సాధించింది. ఆగస్టు నెలలో రికార్డు స్థాయిలో కార్లు విక్రయించింది. భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధిక రికార్డు. గత నెల (ఆగస్టు 2023)లో మారుతి సుజుకి 1.89 లక్షల కార్లు విక్రయించింది. ఇదిలా ఉంటే బుల్లి కార్లు, సబ్ కంపాక్ట్ కార్ల సెగ్మెంట్లలో మారుతి సుజుకిదే ఆధిపత్యం. అయినప్పటికీ ఆల్ టైం గరిష్ట స్థాయి కార్ల విక్రయంలో మారుతి సుజుకికి ఎస్యూవీ కార్ల సేల్స్ దన్నుగా నిలిచాయి. ఎస్యూవీ పోర్ట్ ఫోలియోలో బ్రెజా, గ్రాండ్ విటారా, ఫ్రాంక్స్, జిమ్నీ ముందు వరుసలో నిలుస్తాయి.
2022 ఆగస్టుతో పోలిస్తే 2023 ఆగస్టులో మారుతి కార్ల విక్రయాల్లో 14 శాతం గ్రోత్ నమోదైంది. గతేడాది ఆగస్టులో మారుతి సుజుకి 1,65,173 కార్లు విక్రయించినట్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. 2023 ఆగస్టులో 1,89,082 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి. దేశీయంగా గతేడాది 1,34,166 కార్లు అమ్ముడు కాగా, గత నెలలో 1.56 లక్షల కార్లు సేల్ అయ్యాయి. దేశీయ సేల్స్‌లో మారుతి సుజుకి సుమారు 16 శాతం గ్రోత్ నమోదు చేసింది.
ఒకప్పుడు మారుతి సుజుకి కార్ల విక్రయాల్లో బుల్లి కార్లు.. ఆల్టో వంటి మోడల్స్ ప్రధాన భూమిక పోషించేవి. కానీ ప్రస్తుతం బుల్లి కార్ల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. గతేడాదితో పోలిస్తే ఆగస్టులో బుల్లి కార్ల విక్రయాలు 22,162 యూనిట్ల నుంచి 12,209 యూనిట్లకు పడిపోయాయి. కంపాక్ట్ సెగ్మెంట్ కార్లు.. బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్ వంటి మోడల్ కార్లు 71,557 నుంచి స్వల్పంగా పెరిగి 72,451 యూనిట్లకు చేరాయి.
ఇక ఎస్యూవీ సెగ్మెంట్లోనూ మారుతి సుజుకి దూకుడుగా దూసుకెళ్తున్నది. బ్రెజా, గ్రాండ్ విటారా, ఫ్రాంక్స్, జిమ్నీ వంటి యుటిలిటీ సెగ్మెంట్ కార్ల సేల్స్ గతేడాది ఆగస్టుతో పోలిస్తే గత నెలలో 26,932 నుంచి 58,746 యూనిట్లకు దూసుకెళ్లాయి. ఇక మల్టీ పర్పస్ వెహికల్స్ ఎర్టిగా, ఎక్స్ ఎల్6, ఇన్విక్టో మోడల్ కార్ల విక్రయాలు కూడా గణనీయంగానే నమోదయ్యాయి.
గతేడాదితో పొలిస్తే గత నెల ఎగుమతుల్లోనూ గ్రోత్ కనిపించింది. 2022 ఆగస్టుతో పోలిస్తే గత నెలలో మారుతి సుజుకి కార్ల ఎగుమతులు 21,481 యూనిట్ల నుంచి 24,614 యూనిట్లకు పెరిగాయి. గత నెల సేల్స్‌లో ఆల్ టైం రికార్డు నెలకొల్పడంతో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో మారుతి సుజుకి షేర్లు లాభాలు గడించాయి. ఎన్ఎస్ఈలో 3.47 శాతం లాభంతో రూ.10,351.30, బీఎస్ఈలో 3.44 శాతం గ్రోత్ తో రూ.10,350 వరకూ చేరుకుంది. చివరకు ముగింపు సమయానికి 3.15 శాతం పెరుగుదలతో రూ.10,320 వద్ద స్థిర పడింది. ఇంట్రా డే ట్రేడింగ్ లో మారుతి సుజుకి షేర్ 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది.