SAP Lay Offs | ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న టెక్ సంస్థల జాబితాలో జర్మనీ సాఫ్ట్వేర్ జెయింట్ `శాప్` చేరింది. దాదాపు 3000 మంది ఉద్యోగులను సాగనంపింది. వాల్డోర్ఫ్ ఆధారిత గ్రూప్ సంస్థ శాప్.. సంప్రదాయక సాఫ్ట్వేర్, క్లౌడ్-బేస్డ్ కంప్యూటింగ్ సర్వీస్‌లు అందిస్తున్నది. సంస్థ పనితీరు సమర్ధవంతం చేసేందుకూ, కోర్ బిజినెస్ బలోపేతానికి సంస్థ పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం దాదాపు 2.5 శాతం మంది ఉద్యోగులపై వేటు వేయనున్నది. ప్రపంచవ్యాప్తంగా శాప్‌లో సుమారు 1.20 లక్షల మంది పని చేస్తున్నారు.
ఆర్థిక మాంద్యం ముప్పు నేపథ్యంలో ఇప్పటికే టెక్ జెయింట్స్ మెటా, అమెజాన్, గూగుల్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్ తదితర సంస్థలు భారీగా ఉద్యోగులను తొలగించాయి. ఉద్యోగుల ఉద్వాసనతో శాప్‌కు 2023 తొలి త్రైమాసికంలో దాదాపు 250-300 మిలియన్ యూరోలు పొదుపు చేస్తుందని తెలుస్తున్నది. సంస్థ పునర్వ్యవస్థీకరణతో శాప్‌కు 2024లో 300-350 మిలియన్ల యూరోలు ఆదా అవుతుంది.
శాప్ తన అనుబంధ క్వాల్ట్రిక్ సంస్థను విక్రయించనున్నది. ఆన్లైన్ మార్కెట్ రీసెర్చ్ సాఫ్ట్‌వేర్‌లో ఈ క్వాల్ట్రిక్ సంస్థ స్పెషలైజ్డ్. 2022లో సంస్థ 30.9 బిలియన్ల యూరోల రెవెన్యూ సంపాదించింది. అంతకుముందు ఏడాది (2021)తో పోలిస్తే 11 శాతం ఎక్కువ. 2021తో పోలిస్తే నిర్వహణ లాభాలు రెండు శాతం తగ్గాయి. 2023లో నిర్వహణ లాభాలు 10 నుంచి 13 శాతం పెరుగుతాయని శాప్ అంచనా వేస్తున్నది.