ఇండోర్, ఆగస్టు 4: శక్తి పంప్స్ ఇండియా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.96.83 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.110.23 కోట్లతో పోలిస్తే 12.15 శాతం తగ్గింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం కూడా ఏడాది ప్రాతిపదికన 6.43 శాతం తగ్గి రూ. 622.50 కోట్లకు పరిమితమైంది. అంతకుముందు ఇది రూ.665.32 కోట్లుగా ఉన్నది. ఈ సందర్భంగా శక్తి పంప్స్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ దినేశ్ పాటిదార్ మాట్లాడు తూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాభాలతో ప్రారంభించినట్టు, సోలార్ పంప్ సెగ్మెంట్ అంచనాలకుమించి రాణించడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. ఎగుమతులు నిలకడైన వృద్ధిని నమోదు చేసుకోగా, ప్లాంట్ కెపాసిటీ, టెక్నాలజీ విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి రూ.1,700 కోట్ల పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్టు ఆయన చెప్పారు.
లిల్లీ నూతన టెక్నాలజీ సెంటర్
హైదరాబాద్, ఆగస్టు 4: ఎలీ లిల్లీ అండ్ కంపెనీ(ఇండియా).. హైదరాబాద్‌లో నూతన టెక్నాలజీ, ఇన్నోవేషన్ సెంటర్‌ను నెలకొల్పింది. 2.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇన్నోవేషన్, డిజిటల్ కెపబిలిటీ విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సెంటర్ దోహదం చేయనున్నదని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డియోగు రావు తెలిపారు. ప్రస్తుతం ఈ సెంటర్లో 100 విధులు నిర్వహిస్తుండగా, వచ్చే కొన్ని సంవత్సరాల్లో 1,500కి పెంచుకోనున్నట్లు ఆయన చెప్పారు.
మెడ్‌టెక్‌లో తెలంగాణ..
మెడ్‌టెక్ రంగంలో తెలంగాణ అవకాశాల గని అని.. లైఫ్ సైన్సెస్, డిజిటల్ హెల్త్, ఏఐ ఇన్ హెల్త్‌కేర్, తెలంగాణ డేటా ఎక్స్ఛేంజ్లతో ఇండస్ట్రీ పాలసీని అనుసంధానం చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఎలీ లిల్లీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ.. ఏటా 3 లక్షలమంది స్టెమ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారని తెలిపారు. జీనోమ్ వ్యాలీ, మెడ్‌టెక్ పార్ లాంటి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు ఇక్కడ అందుబాటులో మంత్రి ఉన్నాయన్నారు.