హైదరాబాద్, జూలై 6: ఎయిర్‌క్రాఫ్ట్, రాకెట్ ఇంజిన్ల డిజైన్, తయారీలో దిట్ట. ఏరోస్పేస్‌తోపాటు డిఫెన్స్ రంగ పరికరాలు, విడిభాగాల ఉత్పత్తిలో దిగ్గజం. ఫ్రాన్స్‌కు చెందిన బహుళజాతి సంస్థ శాఫ్రాన్ గురించి చెప్పాలంటే ఇలా పెద్ద జాబితానే ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఈ కంపెనీ.. ఇప్పుడు హైదరాబాద్‌లో తమ అతిపెద్ద, తొలి ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ మెయింటేనెన్స్, రిపేర్, ఓవరాల్ (ఎంఆర్వో) కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నది. 2005 మే 11న స్నెక్మా, సగెం కంపెనీల విలీనంతో శాఫ్రాన్ గ్రూప్ ఆవిర్భవించింది. అనేక అనుబంధ సంస్థలు ఈ గ్రూప్‌లో ఉన్నాయి. ఎయిర్‌బస్ గ్రూప్, బోయింగ్లతోనూ కలిసి పనిచేస్తుండటం విశేషం.
ఇక 2018 ఫిబ్రవరిలో జోడియాక్ ఏరోస్పేస్ను శాఫ్రాన్ చేజిక్కించుకున్నది. ఎయిర్‌క్రాఫ్ట్ ఎక్విప్మెంట్ కార్యకలాపాల్లో సంస్థకిది ఎంతో కలిసొచ్చిన డీల్. ఈ క్రమంలో భాగ్యనగరంలో రూ.1,200 కోట్లతో ప్లాంట్‌ను తెస్తున్నది. ప్రస్తుతం దేశ, విదేశాల్లో నడుస్తున్న ఎన్నో ఎయిర్‌లైన్స్ విమానాల్లో శాఫ్రాన్ ఇంజిన్లే ఉన్నాయి. ఇకపై వీటి మెయింటేనెన్స్, రిపేర్, ఓవరాల్ హైదరాబాద్‌లో జరగనుందన్నమాట.