US Dollar @ Rs.83.01 | ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ రోజురోజుకి సరికొత్త కనిష్ట రికార్డులు నెలకొల్పుతున్నది. బుధవారం ట్రేడింగ్‌లో 63 పైసలు నష్టపోయి రూ.83 దిగువకు పడిపోయింది. ఓవర్సీస్ మార్కెట్లలో డాలర్ బలంగా ఉండటంతోపాటు దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ వల్ల రూపాయి పతనమైంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగిపోవడంతో ఇన్వెస్టర్లు రిస్క్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఫలితంగా రూపాయి మారకం విలువపై ప్రతికూల ప్రభావం చూపింది.
బుధవారం ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో డాలర్‌పై రూపాయి మారకం విలువ రూ.82.32 వద్ద మొదలైంది. ప్రారంభంలో కొంత పుంజుకున్నా.. ఇంతకుముందు సెషన్ ముగింపుతో పోలిస్తే ఇంట్రా డే ట్రేడింగ్‌లో 61 పైసలు పతనమై రూ.83.01 వద్దకు పడిపోయింది. రూపాయి చరిత్రలో ఇదే సరికొత్త కనిష్ట స్థాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి రూపాయి కాస్త పుంజుకుని రూ.82.40 వద్ద స్థిర పడింది. ఆరు దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్ ఇండెక్స్ 0.31 శాతం పుంజుకుని 112.48 వద్దకు చేరుకున్నది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్ ధర 0.82 శాతం పెరిగి 90.77 డాలర్లకు చేరుకున్నది.
దేశీయ స్టాక్ మార్కెట్లలో బీఎస్ఈ- 30 ఇండెక్స్ సెన్సెక్స్ 146.59 పాయింట్లు వృద్ధి చెంది 59,107.19 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 25.30 పాయింట్లు లాభపడి 17,512.25 పాయింట్ల వద్ద స్థిర పడింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ. 153.40 కోట్ల విలువైన షేర్లు విక్రయించారు.