ముంబై, జూన్ 13: అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలరు బలోపేతం కావడంతో దేశీ కరెన్సీ రూపాయి విలువ రికార్డు కనిష్ఠానికి పడిపోయింది. సోమవారం నాడిక్కడ ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ కరెన్సీ (ఫారెక్స్) మార్కెట్లో డాలరు మారకంలో రూపాయి విలువ 11 పైసలు పతనమై 78.04 వద్ద ముగిసింది. ఒకదశలో కొత్త ఆల్‌టైమ్ కనిష్ఠం 78.29 వద్దకు పడిపోయినప్పటికీ, ట్రేడింగ్ ముగింపులో రిజర్వ్‌బ్యాంక్ డాలర్లను సరఫరా చేయడంతో నష్టాల్లో కొంతవరకూ కోలుకుందని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. ఈక్విటీ మార్కెట్లు దెబ్బతినడం, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు దేశం నుంచి తరలివెళుతుండటం, పలు ఆసియా దేశాల కరెన్సీలు బలహీనపడటం తదితర అంశాలు రూపాయిని దెబ్బతీశాయని డీలర్లు వివరించారు. డాలరు బలాన్ని తెలిపే డాలర్ ఇండెక్స్ అంతర్జాతీయ మార్కెట్లో 0.55 శాతం పెరిగి 104.71 వద్దకు చేరింది. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపును వేగవంతం చేస్తుందన్న అంచనాలు రూపాయి, ఇతర వర్థమాన కరెన్సీల బలహీనతకు ప్రధాన కారణమని, ఈ సెప్టెంబర్‌కల్లా ఫెడ్ 175 బేసిస్ పాయింట్ల మేర రేట్లు పెంచవచ్చని భావిస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ తెలిపారు. 78.30 దిగువకు రూపాయి తగ్గితే మరింతగా క్షీణించి రూ.78.50, 78.70 స్థాయిల్ని తాకవచ్చని, సమీప భవిష్యత్తులో 77.70 స్థాయి మద్దతుగా నిలుస్తున్నదని పర్మార్ విశ్లేషించారు.