Redmi new Phone : భారత మొబైల్ మార్కెట్లోకి మంగళవారం రెడ్మీ (Redmi) కొత్త ఫోన్ విడుదలైంది. రెడ్మీ 13 5జీ (Redmi 13 5G) మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. షావోమి హైపర్ ఓఎస్‌తో వస్తున్న తొలి రెడ్మీ ఫోన్ ఇదే. క్రిస్టల్ గ్లాస్ డిజైన్‌తో రూపొందిన ఈ ఫోన్ బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్ ఇస్తోంది. డిజైన్ విషయంలో రెడ్మీ 13 5జీ రెడ్మీ 12 5జీని పోలి ఉంది.
ఈ ఫోన్‌కు 120Hz రీఫ్రెష్ రేటుతో 6.79 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ డిస్ప్లే ఇచ్చారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో ఇది వచ్చింది. ఈ సెగ్మెంట్లో డ్యూయల్ గ్లాస్ డిజైన్‌తో వస్తోన్న ఫోన్ ఇదేనని కంపెనీ తెలిపింది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఏఈ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,030mAh బ్యాటరీ దీనిలో ఉంది. 108MP ప్రధాన కెమెరా ఇచ్చారు.
అదేవిధంగా సెల్ఫీల కోసం 13MP కెమెరా ఉంది. కెమెరా పక్కనున్న రింగ్ ఫ్లాష్ ఈ ఫోన్ ప్రత్యేకత. ఫొటో తీసేటప్పుడే కాకుండా కాల్స్, నోటిఫికేషన్స్ సమయంలోనూ ఇది ఫ్లాష్ అవుతుంది. హవైన్ బ్లూ, ఆర్కిడ్ పింక్, బ్లాక్ డైమండ్ రంగుల్లో ఈ కొత్త ఫోన్ అందుబాటులో ఉంది. ఫోన్‌తో పాటే ఛార్జర్‌ను కూడా ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ ఓఎస్‌తో ఇది పని చేస్తుంది. రెండు ఓఎస్‌లు, నాలుగేళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్లు అందిస్తామని కంపెనీ పేర్కొంది.
ఈ రెడ్మీ కొత్త ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అందులో 6 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ ఒకటి. దీని ధర రూ.12,999. ఇంకోటి 8 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. దీని ధర రూ.14,999 గా నిర్ణయించారు. మైక్రోఎస్డీ కార్డుతో స్టోరేజ్‌ను 1TB వరకు విస్తరించుకోవచ్చు. కంపెనీ ఆన్లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లతోపాటు అమెజాన్‌లో ఈ ఫోన్ జూలై 12న మధ్యాహ్నం 12 గంటల నుంచి విక్రయానికి అందుబాటులోకి వస్తుంది.