ఏ ఉద్యోగం చేసినా.. ఎంత సంపాదించినా.. చివరికి ప్రశాంతమైన రిటైర్మెంట్ జీవితం గడపడం కోసమే. అప్పటివరకు జీవితంలో అనుభవించిన కష్టాలన్నింటినీ మరిచి ఆనందంగా జీవించే సమయమే పదవీ విరమణ అనంతర కాలం. నిజానికి చాలా మంది రిటైర్మెంట్ తరువాతనే తమ అసలు జీవితం మొదలు పెడతారు. అయితే రిటైర్మెంట్ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం అందించే ఉద్యోగం ఉండదు. అందుకు అవసరమైన నిధులు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. దాని కోసం ఉద్యోగంలో ఉన్నప్పుడే సరైన ఆర్థిక నిర్ణయాలను తీసుకోవాలి. సమర్థవంతంగా పెట్టుబడి వ్యూహాలు ఎంచుకోవాలి. అలాంటప్పుడే వాళ్ల జీవితంతోపాటు, వాళ్లు ప్రేమించే కుటుంబ సభ్యుల భవిష్యత్తు కూడా భద్రంగా ఉంటుంది.
యువకునిగా ఉన్నప్పుడే రిటైర్మెంట్ ప్రణాళిక మొదలు పెడితేనే ప్రయోజనం అధికం. ఎంత తొందరగా పొదుపు మొదలు పెడితే అంత త్వరగా దానిమీద రాబడులు అందుకోవచ్చు. ఉద్యోగంలో చేరిన తొలి ఏడాది నుంచే రిటైర్మెంట్ కోసం ఆదా చేయాలనే ఆలోచన ఎవరికీ ఉండదు. అది అసలు ఎవరి మదిలోకీ రాదు. నిజానికి ఆ సమయంలో వ్యక్తిగత స్థాయిలో బాధ్యతలు ఎక్కువగా ఉండవు. అందుకని ఆ సమయంలోనే పొదుపు మొదలు పెడితే మంచిది. రిటైర్మెంట్ సమయానికి తగిన లక్ష్యాలను ఎంచుకుని దానికి అనుగుణంగా పొదుపు-మదుపు చేయాలి. అలా చేస్తేనే సమయానికి ఎక్కువ మొత్తం జమవుతుంది. చక్రవడ్డీ రూపంలో మనం చేసే పొదుపునకు ఇంకా అదనంగా డబ్బు పోగవుతూ ఉంటుంది. ఇలా తొందరగా చిన్న వయసులోనే పొదుపు మొదలు పెడితే.. పొదుపు ఒక అలవాటుగా మారుతుంది. దీంతో ఆర్థిక క్రమశిక్షణా అలవడుతుంది.
సరైన ప్రణాళిక ఎలా?
రిటైర్మెంట్ తరువాత కూడా నెలవారీ ఆదాయం వచ్చే రీతిలో అనువైన ప్రణాళిక ఎంచుకోవాలి. వయసు మీరిన తర్వాత అవసరమయ్యే నెలవారీ ఖర్చులు, వైద్య, వినోదం వంటి వాటికి అయ్యే వ్యయం అన్నింటినీ బేరీజు వేసుకుని సదరు ఆదాయం వచ్చే రీతిలో ప్రణాళిక చేసుకోవాలి. ఇవన్నీ ముందే చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. దీని కోసం ముందస్తు పరిశోధన అవసరం. ఎంచుకున్న జీవిత లక్ష్యాలు, అందుబాటులో ఉన్న పొదుపు-మదుపు పథకాలు, మీకున్న ఆర్థిక సానుకూలత, పరిమితులు ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి.
జీవిత బీమా కీలకం
రిటైర్మెంట్ ప్రణాళికలో జీవిత బీమా ఒక భాగంగా ఉండాలి. ఆ బీమా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. మీకు అందుబాటులో ఉన్న జీవిత బీమా పథకాలనే ఎంచుకోవాలి. అది పెన్షన్ ప్లాన్ లేదా ఎండోమెంట్ ప్లాన్ లేదా హోల్ లైఫ్ బీమా ప్రణాళిక కావచ్చు. వీటిలో నుంచి మీరు అనువైన ప్లాన్ ఎంచుకోవచ్చు. వాటి ద్వారా ఆదాయం అందే తీరును కూడా మీరే నిర్ణయించుకోవచ్చు. కావాలంటే ఒకేసారి బీమా మొత్తం మీ చేతికి అందేలా ప్లాన్ చేసుకోవచ్చు లేదంటే విడతలవారీగా ఏడాదికి, ఆర్నెళ్లకు, మూణ్ణెళ్లకు, నెలనెలా కొంత ఆదాయం అందే రీతిలో ప్లాన్ చేసుకోవచ్చు. కొన్ని జీవిత బీమా పథకాలలో గడువు చివర్లో పెద్ద మొత్తం చేతికి అందుతుంది. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని, రిటైరైన తర్వాత కూడా మంచి ఆదాయం అందించే బీమా పథకాలు కూడా ఉన్నాయి.
నెలనెలా ఆదాయం
అన్ని జీవిత బీమా కంపెనీలు నెలనెలా ఆదాయం అందించే పథకాలను ఆఫర్ చేస్తున్నాయి. వీటిని మంత్లీ ఇన్కం ప్లాన్స్ అంటారు. క్రమం తప్పకుండా కొన్నేండ్లపాటు ప్రీమియం చెల్లిస్తే దాంతో పెద్ద మొత్తమే జమవుతుంది. ఇలాంటి పథకాలలో మదుపు చేసిన వ్యక్తికి బీమా కూడా వర్తిస్తుంది. అంతేకాకుండా ఎంచుకున్న పాలసీ గడువు ముగిసిన తరువాత మెచ్యూరిటీ ప్రయోజనాలు కూడా అందుతాయి. ప్రతి నెలా నిర్దిష్టంగా కొంత ఆదాయం అందించే వెసులుబాటుతోపాటుగా బీమా మొత్తం చెల్లించే విషయంలో ఈ పథకాలలో రకరకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. రిటైర్మెంట్ తర్వాత నెలనెలా క్రమాదాయం అందుకోవాలని ఆశించేవారికి ఇలాంటి బీమా పథకాలు చాలా అనువైనవి. ఒక వ్యక్తి జీవితకాలంలో ఆయా కీలక సమయాలలో అవసరమైన స్థాయిలో ఆదాయం అందించే పథకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కుటుంబ భద్రతతోపాటుగా, భవిష్యత్ అవసరాలు కూడా తీర్చే రీతిలో పథకాలను ఎంచుకోవచ్చు.
బీమా ప్రయోజనాలు
జీవిత బీమా వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఒక పక్క సురక్షిత రీతిలో ఆదాయం అందుకోవచ్చు, మరోపక్క తగిన స్థాయిలో బీమా కవరేజీ ఉంటుంది. వీటిలో పెట్టుబడులకు రిస్కు కూడా తక్కువే. అస్థిరత అన్నది ప్రస్తుతం ఆర్ధిక వ్యవస్థలో ఒక అంతర్భాగ అంశంగా కనబడుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో అవసరమైనప్పుడు కొంత ఆదాయం అందించగలిగే ఈ మనీ ఆప్షన్ పథకాలు మనకు ఒకింత ఆసరా ఇస్తాయి. రిటైర్మెంట్ ప్లాన్ మన ఆదాయానికి భద్రత కల్పిస్తుంది.