RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం నిల్వలు భారీగా పెరిగాయి. మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషల్ సెటిల్మెంట్స్ నుంచి 102 టన్నుల బంగారాన్ని బదిలీ చేసుకుంది. దీంతో ఆర్బీఐ బంగారం నిల్వలు 855 మెట్రిక్ టన్నులకు చేరాయి. ఈ విషయాన్ని ఆర్బీఐ హాఫ్ ఇయర్ నివేదిక వెల్లడించింది. ఇందులో స్వదేశంలో 510.5 టన్నులు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వద్ద 324 మెట్రిక్ టన్నుల నిల్వ ఉన్నది. ఇక మరో 20.26 టన్నుల బంగారం డిపాజిట్ల రూపంలో ఆర్బీఐ వద్ద ఉందని నివేదిక పేర్కొంది. మొత్తం విదేశీ మారక నిల్వలలో బంగారం వాటా మార్చి 2024 చివరి నాటికి 8.15 శాతం నుంచి సెప్టెంబర్ 2024 చివరి నాటికి దాదాపు 9.32 శాతానికి పెరిగింది.
మార్చి 2024 నాటికి ఆర్బీఐ వద్ద 822.10 టన్నుల బంగారం ఉన్నది. ఇందులో దేశీయంగా 408.31 టన్నులు, 387.26 టన్నులు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) ఉన్నది. 26.53 టన్నుల బంగారం డిపాజిట్ల రూపంలో ఉంది. ఈ సంవత్సరం ప్రారంభంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నుంచి ఆర్బీఐ వంద టన్నుల బంగారాన్ని భారత్కు దిగుమతి చేసుకున్నది. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ వద్ద 822.10 టన్నుల గోల్డ్ నిల్వలు ఉన్నాయి. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత కారణంగా ఆర్బీఐ విదేశాల్లో ఉంచిన బంగారం నిల్వలను భారత్కు దిగుమతి చేసుకుంటున్నది. దాంతో బంగారం సేఫ్గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ 2022 నుంచి భారత్ ఇప్పటి వరకు 214 టన్నుల బంగారాన్ని ఆర్బీఐ భారత్కు తరలించింది.