ఆకర్షణీయమైన వడ్డీరేటుతో సేవింగ్స్‌కు ప్రయత్నించేవారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్ (ఎఫ్ఆర్ఎస్బీ)ను పరిశీలించవచ్చు. మునుపెన్నడూ లేనివిధంగా 8.05 శాతం వడ్డీ లభిస్తున్నది. 2020లో ఆర్బీఐ ఈ బాండ్లను పరిచయం చేసిన దగ్గర్నుంచి ఇదే అత్యధికం. అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై ప్రస్తుతం చాలా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఇస్తున్న వడ్డీరేటు కంటే కూడా ఇది ఎక్కువే. అంతేగాక ఈ బాండ్లను ఆర్బీఐ జారీ చేస్తున్నది కాబట్టి ఇవి అత్యంత సురక్షితం. ఎంపిక చేసిన బ్యాంకుల్లో ఆసక్తిగల మదుపరులు ఈ బాండ్లను కొనుగోలు చేయవచ్చు.
ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్‌పై వడ్డీరేటు స్థిరంగా ఉండదన్న అంశాన్ని పెట్టుబడికి ముందే మదుపరులు గుర్తుంచుకోవాలి. ఈ బాండ్లపై వడ్డీరేట్లు కేంద్ర ప్రభుత్వ చిన్నమొత్తాల పొదుపు పథకం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ఎస్సీ) వడ్డీరేట్లపై ఆధారపడి ఉంటాయి. ఎన్ఎస్సీ వడ్డీరేటు ఎంత? ఉంటే దానిపై 0.35 శాతం అధికంగా ఈ ఎఫ్ఆర్ఎస్బీలపై వడ్డీరేటు ఉంటుంది. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే ప్రస్తుతం ఎన్ఎస్సీ వడ్డీరేటు 7.7 శాతంగా ఉన్నది. అందుకే దీనికి 0.35 శాతం కలిపి 8.05 శాతంగా ఎఫ్ఆర్ఎస్బీలపై వడ్డీరేటును నిర్ణయించారు. ఇక ఈ బాండ్లపై వడ్డీరేట్ల సమీక్ష ప్రతీ ఆరు నెలలకోసారి జరుగుతుంది. తదుపరి రివ్యూ వచ్చే ఏడాది జనవరి 1. మళ్లీ జూలై 1న చేస్తారు. ఏటా ఇదే తేదీల్లో వడ్డీరేట్ల సమీక్ష ఉంటుంది. ఒకవేళ అప్పుడు ఎన్ఎస్సీ వడ్డీరేటు 7.5 శాతానికి తగ్గితే బాండ్లపై వడ్డీ కూడా7.85 శాతానికి పడిపోతుంది. అలాగే ఎన్ఎస్సీ వడ్డీరేటు 8 శాతానికి పెరిగితే బాండ్లపై వడ్డీ 8.35 శాతానికి వెళ్తుంది. ఎన్ఎస్సీ వడ్డీరేట్లను ప్రతీ మూడు నెలలకోసారి సమీక్షిస్తున్నారు.
ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్.. ఏడేండ్ల లాకిన్ పీరియడ్‌తో ఉంటుంది. గడువుకు ముందుగానే ఉపసంహరించుకోవడానికి వీల్లేదు. అయితే సీనియర్ సిటిజన్లకు మినిమం లాకిన్ పీరియడ్ తర్వాత కొంత మొత్తం జరిమానాగా చెల్లిస్తే బాండ్ విత్‌డ్రాకు వీలున్నది. 60-70 ఏండ్లవారికి లాకిన్ పీరియడ్ ఆరేండ్లుగా ఉంటే, 70-80 ఏండ్లవారికి ఐదేండ్లుగా, ఆపై వయస్కులకు నాలుగేండ్లుగా ఉన్నది. ఇక ఈ బాండ్లలో వెయ్యి రూపాయలకు తగ్గకుండా ఎంతైనా పెట్టుబడిగా పెట్టవచ్చు.
చివరగా..ఈ బాండ్లపై పొందే వడ్డీకి ప న్ను ఉంటుంది. వీటిని తనఖా పెట్టి రుణాలను తీసుకోలేరు. నగదు నిల్వలు సమృద్ధిగా ఉన్నవారు, ఎఫ్‌డీల్లో దీర్ఘకాల పెట్టుబడులు పెట్టాలనుకునేవారికే ఇవి అనుకూలం.
ఎస్బీఐ 6.5%
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 7%
ఐసీఐసీఐ బ్యాంక్ 7%
జూలై-సెప్టెంబర్కుగాను ఐదేండ్ల ఎఫ్డీపై 7.7 శాతం వడ్డీరేటును అందిస్తున్న ఎన్ఎస్సీ
జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి ఐదేండ్ల ఎఫ్డీపై 7.5 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్న పోస్టాఫీస్
ఐదేండ్ల పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం అకౌంట్లో జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికిగాను 7.4 శాతం వడ్డీరేటు