Rahul Bajaj | కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు మరణించిన వెటరన్ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ అంత్య క్రియలు ఆదివారం నిర్వహిస్తారు. ఆయకు ఇద్దరు కొడుకులు రాజీవ్ బజాజ్, సంజీవ్ బజాజ్, కూతురు సునయన కేజ్రీవాల్ ఉన్నారు. గతేడాది ఏప్రిల్ 30 నుంచి బజాజ్ ఆటో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, చైర్మన్గా వైదొలిగారు. ప్రస్తుతం గ్రూప్ చైర్మన్ ఎమిరస్గా ఉన్నారు.
కొద్దికాలంగా న్యూమోనియా, గుండె సంబంధ ఆరోగ్య సమస్యలతో రాహుల్ బజాజ్ బాధ పడుతున్నారు. నెల రోజులుగా దవాఖానలో చికిత్స పొందుతున్నారని రూబీ హాల్ క్లినిక్ మేనేజింగ్ ట్రస్టీ పర్వేజ్ గ్రంట్ చెప్పారు. 1938, జూన్ 10న జన్మించారు. 40 ఏండ్లకు పైగా బజాజ్ గ్రూప్ చైర్మన్గా రాహుల్ బజాజ్ సేవలందించారు.రాజ్యసభ సభ్యుడిగానూ పని చేశారు. పారిశ్రామిక రంగంలో ఆయన సేవలకు గుర్తింపుగా 2001లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రదానం చేసింది.