న్యూఢిల్లీ : అమెరికన్ చిప్ దిగ్గజం క్వాల్‌కాం (Qualcomm) లేఆఫ్స్‌ను ప్రకటించింది. తన ఉద్యోగుల్లో 2.5 శాతం మందిని దాదాపు 1258 మందిని విధుల నుంచి తొలగించనున్నట్టు వెల్లడించింది. ఆర్ధిక అనిశ్చితి, సెమీకండక్టర్ పరిశ్రమలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరణపై దృష్టిసారించినట్టు కంపెనీ తెలిపింది.
ఈ ఏడాది డిసెంబర్లో కొలువుల కోత చేపడతామని క్వాల్‌కాం స్పష్టం చేసింది. శాండియాగో, శాంటా క్లారా ప్లాంట్స్‌లో ఉద్యోగుల తొలగింపు ఉంటుందని కంపెనీ పేర్కొంది. అయితే ప్లాంట్ల మూసివేత ఉండబోదని వెల్లడించింది. స్ధూలార్ధిక పరిస్ధితుల అనిశ్చితి, డిమాండ్ మందగమనంతో ఈ చర్యలు చేపడుతున్నామని, కీలక వృద్ధి, వైవిధ్య అవకాశాలను అందిపుచ్చుకునే క్రమంలో సంక్లిష్ట నిర్ణయాలు తప్పలేదని కంపెనీ పేర్కొంది.
డిసెంబర్లో లేఆఫ్స్‌ను కంపెనీ ముందుకు తీసుకువెళ్లనుండటంతో బాధిత ఉద్యోగులతో పాటు టెక్ పరిశ్రమ క్వాల్‌కాం భవిష్యత్ చర్యలను, కంపెనీ కార్యకలాపాలపై దీని ప్రభావాన్ని నిశితంగా గమనిస్తున్నారు. వేటు పడనున్న ఉద్యోగులకు క్వాల్‌కాం ఎలాంటి పరిహార ప్యాకేజ్‌ను వర్తింపచేస్తుందనే వివరాలపై ఇప్పటివరకూ కంపెనీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
Read More :