న్యూఢిల్లీ, ఆగస్టు 27: ఆన్లైన్ సేవల సంస్థ మీషో..తన గ్రాసరీ వ్యాపారాన్ని మూసివేసింది. దీంతో ఈ విభాగంలో పనిచేస్తున్న 300 మంది సిబ్బంది ఉపాధి కోల్పోయారు. సూపర్‌స్టోర్ పేరుతో గ్రాసరీ ఉత్పత్తులను తెలంగాణతోపాటు కర్ణాటక, ఏపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో విక్రయిస్తుండేది. కానీ, ఈ వ్యాపారంలో సరైన రాబడి లేకపోవడం, మరోవైపు నిర్వహణ ఖర్చులు అధికమవడం వల్లనే నిలిపివేయాల్సి వచ్చిందని కంపెనీ వర్గాల వెల్లడించాయి. మేనేజర్లు, వేర్‌హౌజ్ మేనేజర్లు, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లతోపాటు ఇతర ఉద్యోగుల సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ వ్యాపారం ఆశించిన స్థాయిలో నడవడం లేదు.. ఎలాంటి ఆదాయం రాకపోవడంతో అత్యధిక నగరాల్లో ఈ వ్యాపారాన్ని నిలిపివేయాలని నిర్ణయించినట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు.