Adani Group M-cap | గత ఏడాది కాలంలో అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువ 2-6 రెట్లు పెరిగింది. గత ఏడాది అక్టోబర్‌లో అదానీ గ్రూప్‌కు చెందిన ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.65 లక్షల కోట్లు పెరిగింది. ప్రస్తుతం వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8.96 లక్షల కోట్లకు చేరుకున్నది. అంటే మూడు రెట్లకు పైగా ఎక్కువైంది.
అదానీ ఎంటర్ ప్రైజెస్ స్క్రిప్ట్ విలువ రూ.296 నుంచి రూ.1,458కి చేరింది. అయితే అదానీ ట్రాన్స్మిషన్ స్టాక్ విలువ రూ.241 నుంచి రూ.1,574కు చేరుకుని గతవారంలో రూ.1,990 వద్ద స్థిరపడింది. అదానీ పవర్ షేర్ రూ.34 నుంచి రూ.95, అదానీ టోటల్ గ్యాస్ రూ.180 నుంచి రూ.1,413కి దూసుకెళ్లాయి. ఇక అదానీ పోర్ట్ స్క్రిప్ట్ రూ.341 నుంచి రూ.734కు, అదానీ గ్రీన్ ఎనర్జీ స్టాక్ విలువ రూ.661 నుంచి రూ.1,395కు పెరిగాయి.
అదానీ గ్రూప్ కంపెనీ షేర్ల విలువతోపాటు వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా పెరిగింది. అదానీ గ్రీన్ ఎనర్జీ ఎం-క్యాప్ అత్యధికంగా పెరిగింది. గతేడాది అక్టోబర్‌లో రూ.1.3 లక్షల కోట్లు ఉంటే, ప్రస్తుతం అది రూ.1.80 లక్షల కోట్లకు చేరుకున్నది. అదానీ పోర్ట్ ఎం-క్యాప్ రూ.69,621 కోట్ల నుంచి రూ.1,49,987 కోట్లకు దూసుకెళ్లింది. అదానీ టోటల్ గ్యాస్ షేర్ రూ.19,705 కోట్ల నుంచి రూ.1,55,447 కోట్ల వద్దకు చేరింది.
అదానీ ఎంటర్ప్రైజెస్ ఎం-క్యాప్ రూ.1.60 లక్షల కోట్లు దాటింది. ఇక అదానీ ట్రాన్స్మిషన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.26,505 కోట్ల నుంచి రూ.1,73,154 కోట్ల వద్దకు దూసుకెళ్లింది. మరోవైపు అదానీ పవర్ ఎం-క్యాప్ రూ.13,306 కోట్ల నుంచి రూ.37,393 కోట్ల వద్దకు చేరుకున్నది.