హైదరాబాద్, ఏప్రిల్ 7: పర్యావరణ పరిరక్షణలో JSP హ్యూండాయ్ కీలక అడుగు వేసింది. కార్పొరేట్ రంగాన్ని సీఎన్జీ వాహనాల వైపు మళ్లించేందుకు సూర్య ట్రావెల్స్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో చేతులు కలిపింది. కర్బన ఉద్గారాలను తగ్గించడంతో పాటు స్థిరమైన వాహనాలను కార్పొరేట్ రంగం ఎంచుకోవడమే లక్ష్యంగా ఈ రెండు సంస్థలు భాగస్వామయ్యాయి. ఈ క్రమంలోనే కార్పొరేట్, లాజిస్టిక్స్ కంపెనీలకు సీఎన్జీ వాహనాలను డెలివరీ చేసిన మొదటిసారే రికార్డు సృష్టించింది. మంగళవారం ఒక్కరోజే హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జేఎస్పీ హ్యూండాయ్ షోరూంలో మొత్తం 35 ఆరా సీఎన్జీ వాహనాలను డెలివరీ చేసింది.
ఈ కార్యక్రమంలో హ్యూండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ తరఫున సౌత్ జోనల్ బిజినెస్ హెడ్ క్రిపా శంకర్ మిశ్రా, సౌత్ జోనల్ కో-ఆర్డినేటర్ యంగ్హూన్ యూన్, రీజినల్ సేల్స్ హెడ్ జి. రామ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్య ట్రావెల్స్ ఎండీ శ్రీనివాస్ మూర్తికి JSP హ్యూండాయ్ ఎండీ పృథ్వీ రెడ్డి వాహనాలకు సంబంధించిన ‘కీ’లను అందజేశారు.
ఈ సందర్భంగా హ్యూండాయ్ రీజినల్ మేనేజర్ శ్రీ రామ్ మాట్లాడుతూ.. స్థిరమైన రవాణా(సస్టైనబుల్ మొబిలిటీ) ప్రాముఖ్యత రోజురోజుకీ పెరుగుతుందని తెలిపారు. సీఎన్జీ వాహనాల ఇంధన సామర్థ్యంతో పాటు ఉద్గారాలను తగ్గించడం, ఖర్చు పొదుపులోనూ పెద్ద ప్రయోజనాలు అందిస్తాయని పేర్కొన్నారు. ఇది భవిష్యత్తు తరాల కోసం పరిశుభ్రమైన, సుస్థిరమైన వాతావరణాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని చెప్పారు.
స్థిరమైన రవాణా దిశగా తాము ముందుకు సాగుతున్నామని JSP హ్యూండాయ్ మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీ రెడ్డి తెలిపారు. కార్పొరేట్ రంగానికి సీఎన్జీ ఆధారిత వాహనాలను అందించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తక్కువ ఖర్చుతోనే మరింత సమర్థవంతమైన పరిష్కారం చూపిస్తామని పేర్కొన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. త్వరలోనే దక్షిణ భారతదేశంలోని మరిన్ని ట్రావెల్, లాజిస్టిక్స్ కంపెనీలతో భాగస్వామ్యమవుతామని చెప్పారు. భవిష్యత్తులో సుమారు 200 హ్యుండాయ్ ఆరా సీఎన్జీ వాహనాలను డెలివరీ చేయడమే తమ లక్ష్యమని అన్నారు.
కార్పొరేట్ రంగంలో సుస్థిర రవాణా పట్ల పెరుగుతున్న ఆసక్తిని చూస్తుంటే ఎంతో ఉత్సాహంగా ఉందని సూర్య ట్రావెల్స్ ఎండీ శ్రీనివాస్ మూర్తి అన్నారు. హ్యూండాయ్ ఆరా వంటి సీఎన్జీ వాహనాల వాడడటం వల్ల కర్బన ఉద్గారాలను తగ్గించగలుగుతామని తెలిపారు. సంప్రదాయ ఇంధనాలకు సీఎన్జీ చక్కటి ప్రత్యామ్నాయమని పేర్కొన్నారు. ఇది తక్కువ ఖర్చుతో హానికరమైన ఉద్గారాలను తగ్గించడంలో దోహదపడుతుందని చెప్పారు.