న్యూఢిల్లీ : వేలాది మందికి ఉద్యోగాలు లభించేందుకు సహకరించే జాబ్ సైట్ ఇండీడ్ ఏకంగా 2,200 మంది ఉద్యోగులపై (layoffs) వేటు వేసింది. కంపెనీలో 15 శాతం సిబ్బందికి ఉద్వాసన పలికింది. ఇండీడ్, ఇండీడ్ ఫ్లెక్స్లోని అన్ని విభాగాల్లో కొలువుల కోత జరిగిందని ఈ విషయంలో కంపెనీ ఆచితూచి నిర్ణయం తీసుకుందని జాబ్ సైట్ సీఈఓ క్రిస్ హైమ్స్ పేర్కొన్నారు.
తమ వ్యూహాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా కంపెనీని రాబోయే రోజుల్లో ముందుకు తీసుకువెళ్లే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. లేఆఫ్స్ నిర్ణయాన్ని బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించిన హైమ్స్ తన మూల వేతనంలో 25 శాతం కోత విధించుకున్నానని తెలిపారు. మిగిలిన 75 శాతం వేతనం ఇండీడ్ రాబడి వృద్ధితో ప్రభావితం అవుతుందని చెప్పారు.
ఉద్యోగాలు కోల్పోయిన వారు 16 వారాల మూల వేతనం, లేదా ప్రతి సంవత్సరం సర్వీసుకు రెండు వారాల వేతనం రెండింటిలో ఏది అధికమైతే దాన్ని పరిహార ప్యాకేజ్‌లో పొందుతారని ప్రకటించారు. అమెరికా అంతటా పలు కంపెనీలు కొలువుల కోతకు దిగడంతో కంపెనీ వృద్ధి మందగించిందని చెప్పారు. అమెరికాలో జాబ్ ఓపెనింగ్స్ తగ్గడంతోనే ఇండీడ్‌లో ఉద్యోగులపై వేటు వేయాల్సి వచ్చిందని అన్నారు. రాబోయే రెండు, మూడేండ్లలో జాబ్ ఓపెనింగ్స్ తగ్గుతాయని ఇండీడ్ అంచనా వేస్తోంది.
Read More :
Google Job Cuts | ఉద్యోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి.. సుందర్ పిచాయ్‌కు ఉద్యోగుల లేఖ..!