ITR Filing | వేతన జీవులైనా.. బుల్లి వ్యాపారవేత్తలైనా.. కార్పొరేట్ సంస్థలైనా ప్రతి ఆర్థిక సంవత్సరంలో తమ ఐటీ రిటర్న్స్ తప్పనిసరిగా సమర్పించాలి. ప్రతి ఏటా ఏప్రిల్-జూలై మధ్య ప్రతి ఒక్కరూ తమ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి పరుగులు తీస్తుంటారు. ఆదాయం పన్ను చట్టం-1961, ఆదాయం పన్ను నిబంధనలు-1962 ప్రకారం ఆదాయం పన్ను చెల్లించాల్సి ఉన్న ప్రతి వ్యక్తి తమ ఆదాయ ధృవ పత్రాలు, ఐటీఆర్-అనుబంధ ముఖ్య పత్రాలు ఆదాయం పన్ను విభాగానికి సమర్పించాల్సి ఉంటుంది.
మీరు సంపాదించే ఆదాయ వనరుల ఆధారంగా మీరు చెల్లించాల్సిన ఆదాయం పన్ను ఖరారవుతుంది. ఆదాయాన్ని బట్టి విభిన్నమైన ఆదాయం పన్ను శ్లాబ్‌లు ఉన్నాయి. ఒక కంపెనీలో షేర్లపై లాభం, వేతనం, వడ్డీ ఆదాయం, పెట్టుబడి లాభం తదితర అంశాలన్నీ ట్యాక్స్ పరిధిలోకి వస్తాయి. కొన్నేండ్లుగా కేంద్ర ప్రభుత్వం ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి జూలై 31 తేదీని తుది గడువుగా ఖరారు చేసింది. తరుచుగా గడువు పొడిగించినా గానీ, టైంలోపు ఐటీఆర్ ఫైల్ చేయకుంటే భారీ పెనాల్టీ చెల్లించాలని మిమ్మల్ని ఇన్‌కం టాక్స్ డిపార్ట్మెంట్ ఆదేశించవచ్చు. గడువులోగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి ట్యాక్స్ ఫైలింగ్ సాఫ్ట్వేర్ వాడటం గానీ, ట్యాక్స్ ప్రొఫెషనల్స్ సలహా తీసుకోవడం గానీ బెటర్.
పాన్ కార్డ్: ఐటీఆర్ ఫైల్ చేయడానికి పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్-PAN). పాన్ కార్డుతో మీ ఆర్థిక లావాదేవీలు ట్రాక్ చేయొచ్చు. బ్యాంక్ అకౌంట్ తీసుకునే ముందు మీరు పాన్ కార్డు సమర్పించకపోతే మీ ఆదాయంలో 20 శాతం పన్ను కింద డిడక్ట్ చేసే అధికారం బ్యాంకులకు ఉంటుంది. పాన్ కార్డు అందిస్తే, 10 శాతం ఆదాయం డిడక్ట్ చేస్తాయి బ్యాంకులు.
ఆధార్ కార్డ్: విశిష్ట ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) జారీ చేసిన 12-అంకెల కోడ్ గల ఆధార్ నంబర్ మీ వ్యక్తిగత గుర్తింపును తెలియజేస్తుంది. ఆధార్ కార్డ్ డేటా బేస్‌లో మొబైల్ నంబర్ లిస్టయి ఉంటే, మీ ఐటీఆర్ ఫామ్ ఎలక్ట్రానిక్ వెరిపికేషన్‌కు ఆధార్ సాయ పడుతుంది.
బ్యాంక్ స్టేట్మెంట్.. వడ్డీ సర్టిఫికెట్లు: అడ్వాన్స్‌గా ఐటీఆర్ ఫైల్ చేయడానికి మీరు మీ బ్యాంక్ స్టేట్మెంట్లు డౌన్లోడ్ చేసుకోవాలి. మీ ఖాతాలో క్రెడిట్ అయిన వడ్డీ ఆదాయం, ఇతర నగదు సమాచారంపై అవగాహనకు బ్యాంక్ స్టేట్మెంట్లు ఉపకరిస్తాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో మీ ఖాతాలో జమ అయిన వడ్డీ ఆదాయం గణించాలంటే బ్యాంకుల నుంచి ఇంటరెస్ట్ సర్టిఫికెట్లు కూడా తీసుకోవాలి. ఆదాయం పన్ను చట్టంలోని 80టీటీఏ సెక్షన్ ప్రకారం బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్, పోస్టాఫీసుల్లోని ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలు, పొదుపు మొత్తాలపై వచ్చే వడ్డీ ఆదాయం నుంచి రూ.10 వేల వరకు డిడక్ట్ చేయవచ్చు.
ఫామ్ 16ఏ: ప్రతి సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు యాజమాన్యాలు ఫామ్-16 సర్టిఫికెట్లు జారీ చేస్తాయి. ఉద్యోగుల వేతనాల నుంచి డిడక్ట్ చేసిన టీడీఎస్‌ను ఆదాయం పన్నుశాఖకు డిపాజిట్ చేసినట్లు రుజువు చేసేదే ఫామ్-16.
ఫామ్-16లో రెండు సెక్షన్లు ఉంటాయి. ఫామ్-16 పార్ట్ ఏలో యాజమాన్యం పేరు, చిరునామా, టాన్, పాన్ నంబర్లు ఉంటాయి. ఉద్యోగి పాన్ నంబర్, నెలవారీగా డిడక్ట్ చేసిన టీడీఎస్ మొత్తం సమాచారం, వేతన చెల్లింపుల వివరాలు ఫామ్-16 పార్ట్ బీలో ఉంటాయి.
పెట్టుబడి లాభాలు లేదా నష్టాలపై స్టేట్మెంట్: మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, బంగారం, ఆస్తులు విక్రయిస్తే వచ్చే లాభాలపై తప్పనిసరిగా పెట్టుబడిపై లాభాలకు పన్ను చెల్లించాలి. బ్రోకర్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్, సీఏఎంఎస్, కే-ఫిన్‌టెక్ వంటి రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ (ఆర్టీఏ) నుంచి క్యాపిటల్ గెయిన్ సర్టిఫికెట్ డౌన్ లోడ్ చేసుకోవాలి.